Lionel Messi: రిటైర్మెంట్ ఇప్పట్లో లేదు.. కొన్నాళ్లు ఆడతా: మెస్సి

ప్రపంచకప్‌ (FIFA world cup 2022)తర్వాత మెస్సి(Lionel Messi) రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని ఆందోళన చెందుతున్న అభిమానులకు ఊరటనిచ్చే కబురు ఇది. మెస్సీ ఇప్పట్లో రిటైర్మెంట్‌ ప్రకటించడంలేదు. ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత అతడే స్వయంగా ఈ విషయం వెల్లడించాడు. 

Published : 19 Dec 2022 11:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచకప్‌ (FIFA world cup 2022)విజయం తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సి (Lionel Messi)వీడ్కోలు పలుకుతాడని భారీగా ప్రచారం జరిగింది. దీనికి నిన్న అర్ధరాత్రి మ్యాచ్‌ అనంతరం మెస్సి(Lionel Messi) వివరణ ఇచ్చాడు. రిటైర్మెంట్‌ ఇప్పట్లో లేనట్లే అని తేల్చిచెప్పాడు. డిసెంబర్‌ 18న నరాలు తెగే ఉత్కంఠ మధ్య అర్జెంటీనాకు ఈ సాకర్‌ మాంత్రికుడు అద్భుత విజయాన్నందించాడు. అనంతరం మాట్లాడుతూ ‘‘నేను నా కెరీర్‌ను దీంతో ముగిద్దామని అనుకొన్నాను. ఇప్పటి వరకు నా కెరీర్‌లో అందనది ఇదే. ఇకపై నేను ఏమీ అడగను. నేను కోపా సాధించగలిగాను. ఇప్పుడు ప్రపంచకప్‌(FIFA world cup 2022) కోసం తీవ్రంగా పోరాడాను. నా కెరీర్‌ చరమాంకంలో దీన్ని సాధించాను. కానీ నేను ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాను. ప్రపంచ ఛాంపియన్‌గా మరికొన్ని గేమ్స్‌ ఆడాలనుకుంటున్నాను’’ అని మెస్సి (Lionel Messi)పేర్కొన్నాడు. 

మరోవైపు ఇన్‌స్టాలో కూడా మెస్సి(Lionel Messi) తన విజయాన్ని పంచుకున్నాడు. ‘ప్రపంచ ఛాంపియన్‌ కావాలని చాలా సార్లు కలలుగన్నాను. సాధించలేకపోయాను. కానీ, ఇప్పుడు దీన్ని నమ్మలేకపోతున్నా. మమ్మల్ని నమ్మిన వారికి, నాకు మద్దుతు ఇచ్చినవారికి, నా కుటుంబానికి ధన్యవాదాలు. అర్జెంటీనా సమష్టిగా పోరాడితే అనుకొన్న లక్ష్యాన్ని సాధించగలదని మరోసారి నిరూపించాము. వ్యక్తుల కంటే ఎక్కువగా ఈ ఘనత జట్టుకే చెందుతుంది. అర్జెంటీనా వాసుల కల కోసం సమష్టిగా పోరాడటంలో ఉన్న బలం ఇది’’ అని పేర్కొన్నాడు.

విశేషాలకు కొదవలేని విజయం..

ఈ ప్రపంచకప్‌(FIFA world cup 2022)తో మెస్సి(Lionel Messi) ఫుట్‌బాల్‌లో సాధించలేనిదంటూ ఏమీ  లేకుండాపోయింది. ప్రపంచకప్‌ టోర్నీల్లో రెండుసార్లు గోల్డెన్‌ బాల్‌ అవార్డు అందుకొన్న ఏకైక ఆటగాడు మెస్సీనే. ఏడు సార్లు బాలెన్‌ డి ఓర్‌ అవార్డు అందుకొన్న మెస్సి (Lionel Messi)అండర్‌ -20 ప్రపంచకప్‌, ఒలింపిక్‌ గోల్డ్‌, కోపా అమెరికా, ఫిఫా ప్రపంచకప్‌  అందుకొన్నాడు. 

మెస్సి (Lionel Messi)2022 ప్రపంచకప్‌(FIFA world cup 2022) టోర్నీకి ముందు ఆడిన వాటిల్లో ఒక్కదానిలో కూడా నాకౌట్‌ దశల్లో గోల్స్‌ చేయలేదు. కానీ, 2022 ప్రపంచకప్‌లో ప్రతి దశలో గోల్స్‌ చేశాడు.

ఈ సీజన్‌లో మెస్సి (Lionel Messi)భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. మొత్తం 29 మ్యాచ్‌లు ఆడిన లియో 24 గోల్స్‌ చేశాడు. 18 గోల్స్‌కు అసిస్ట్‌ చేయడం విశేషం. అంటే మొత్తం 42 గోల్స్‌లో మెస్సి (Lionel Messi)పాత్ర ఉందన్నమాట. ఈ సీజన్‌లో 23 సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లను అందుకొన్నాడు. 8వ సారి బాలెన్‌ డీ ఓర్‌ రేసులో ముందున్నాడు. 

మెస్సీ(Lionel Messi)కి దాసోహమైన ప్రపంచకప్‌ (FIFA world cup 2022)రికార్డులు ఇవే..

* అత్యధిక మ్యాచ్‌(26)లు ఆడిన ఆటగాడు.

* అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌(11)లు పొందిన ఆటగాడు. 

* అత్యధిక గోల్డెన్‌ బాల్‌ అవార్డు(2)లు పొందిన ఆటగాడు. అతిపెద్ద వయస్సులో ఈ అవార్డు అందుకొన్నది కూడా మెస్సీనే.  

* ప్రపంచకప్‌(FIFA world cup 2022) టోర్నీల్లో అత్యధిక నిమిషాలు(2,314) ఆడిన ఆటగాడు.

* అత్యధిక గోల్స్‌ + అసిస్ట్‌ చేసిన ఆటగాడు కూడా మెస్సీనే

* గోల్స్‌ చేయడానికి అత్యధిక  అవకాశాలు సృష్టించిన ఆటగాడు

* అత్యధిక టేక్‌ ఆన్స్‌ (ప్రత్యర్థి నుంచి బాల్‌ను ఆధీనంలోకి తీసుకోవడం) చేసిన ఆటగాడు కూడా మెస్సీనే. 

* కెప్టెన్‌గా అత్యధిక ప్రపంచకప్‌(FIFA world cup 2022) మ్యాచ్‌లు(19) ఆడిన ప్లేయర్‌. 

* ప్రపంచకప్‌లో ఐదు అంతకంటే ఎక్కువ గోల్స్‌ చేసిన అతిపెద్ద వయస్కుడు మెస్సీనే. ప్రస్తుతం అతడి వయస్సు 35 ఏళ్ల 178 రోజులు.

* ప్రపంచకప్‌(FIFA world cup 2022) ఐదు రౌండ్లలో గోల్స్‌ చేసిన ఏకైక ఆటగాడు మెస్సీనే. 

* యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్‌ లీగ్‌, ఫిఫా వరల్డ్‌కప్‌, బాలెన్‌ డి ఓర్‌  సాధించిన నాలుగో ఆటగాడు మెస్సీనే. అంతకు ముందు రివాల్డో(బ్రెజిల్‌), రొనాల్డిన్హో (బ్రెజిల్‌), జినెదిన్‌ జిదానే (ఫ్రాన్స్‌) మాత్రమే ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని