Mohammed Shami: నా దేశం గర్వపడేందుకు నిరంతరం శ్రమిస్తా: షమీ

అర్జున అవార్డును స్వీకరించిన తర్వాత షమీ (Shami) భావోద్వేగంతో చేసిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. దేశంలోనే రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు.

Updated : 10 Jan 2024 16:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను భారత పేస్‌ బౌలర్ మహమ్మద్ షమీ (Shami) అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యున్నత ప్రదర్శనతోపాటు టీమ్‌ఇండియా క్రికెట్‌కు అందించిన సేవలకుగాను అతడికి ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకొన్నాడు.

‘‘ఈ క్షణం ఎంతో గర్వపడుతున్నా. రాష్ట్రపతి నన్ను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుతో సత్కరించారు. ఈ స్థాయికి చేరుకోవడానికి సహకారం అందించినవారందరికీ ధన్యవాదాలు. కెరీర్‌లో ఎత్తుపల్లాలు చవిచూసిన సమయంలో చాలా మంది మద్దతుగా నిలిచారు. నా కోచ్, బీసీసీఐ, జట్టులోని సహచరులు, నా కుటుంబం, సిబ్బంది సహకారం వెల కట్టలేనిది. ముఖ్యంగా నా అభిమానులకు ఎల్లవేళలా రుణపడి ఉంటా. నా శ్రమను గుర్తించి గొప్ప అవార్డును ప్రకటించినందుకు కృతజ్ఞతలు. దేశం గర్వపడేలా చేసేందుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తా. అర్జున అవార్డులను అందుకున్న తోటి క్రీడాకారులకు శుభాకాంక్షలు’’ అని షమీ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.

షమీకి క్రికెటర్ల అభినందనలు

షమీ అర్జున అవార్డు అందుకోవడంపై భారత ప్రస్తుత, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలిపారు. ‘శుభాకాంక్షలు లాలా’ అని కోహ్లీ (Virat Kohli).. ‘కంగ్రాట్స్‌ బ్రదర్’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని