MS Dhoni: ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ నిర్ణయం తప్పే.. ముందు రావాల్సిందే: కివీస్ మాజీ స్టార్

ఉప్పల్‌ వేదికగా హైదరాబాద్‌తో చెన్నై తలపడనుంది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) మెరుపులను చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, దిల్లీపై మాదిరిగా కాకుండా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకురావాలని కివీస్‌ మాజీ స్టార్‌ సూచించాడు.

Published : 05 Apr 2024 17:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్‌ దిల్లీని వణికించేలా చేసింది. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. చెన్నై ఓడినప్పటికీ.. దాదాపు సంవత్సరం తర్వాత అతడి బ్యాటింగ్‌ను చూసే అవకాశం దక్కిందని అభిమానులు ఆనందపడ్డారు. అయితే, ధోనీ ఇంకాస్త ముందుగా క్రీజ్‌లోకి వచ్చి ఉంటే ఓటమి నుంచి చెన్నై బయటపడేదన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సైమన్‌ డౌల్‌ కూడా ఇలానే స్పందించాడు. దిల్లీతో మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో చెన్నై సరైన నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించాడు. సమీర్‌ రిజ్వీ, రవీంద్ర జడేజా కంటే ముందు బ్యాటింగ్‌కు వస్తే బాగుండేదని పేర్కొన్నాడు. ఇప్పుడు హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకురావాలని సూచించాడు. 

‘‘ధోనీ బ్యాటింగ్‌పై చాలా అంచనాలు ఉంటాయి. అతడు క్రీజ్‌లోకి వస్తే ప్రతీ బంతినీ బౌండరీ లైన్‌ దాటాలని అభిమానులు ఆశిస్తారు. దిల్లీపైనా అలాంటి ఇన్నింగ్స్‌ను చూశాం. కానీ, కొన్ని బంతులకు పరుగులు తీయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకవైపు ధోనీ క్రీజ్‌లో ఉన్నప్పుడు అతడికే ఎక్కువగా అవకాశం ఇవ్వాలి. అలాగే ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక రావడమూ సరైంది కాదు. చాలా రోజుల తర్వాత అతడు బ్యాటింగ్‌ చేశాడు. అయినా, ఎక్కడా తడబాటుకు గురైనట్లు కనిపించలేదు. అందుకే, రిజ్వీ, జడేజా కంటే ముందు క్రీజ్‌లోకి వచ్చి ఉంటే దిల్లీపై చెన్నై విజయం సాధించేదే. ఫామ్‌ అందుకోవడానికి కాస్త సమయం పడుతుందనే వాదనను నేను అంగీకరించను. ధోనీ లాంటి అత్యుత్తమ ఆటగాడికి అలాంటి పరిస్థితి లేదు’’ అని సైమన్‌ డౌల్‌ తెలిపాడు. 

ధోనీ ఫ్యాన్స్‌ కోరుకునేదదే: మైకెల్ క్లార్క్

‘‘ఫినిషర్‌ పాత్రను ప్రతిసారీ పోషిస్తాడని నేను అనుకోవడం లేదు. యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కొత్త ఫినిషర్‌ను చెన్నైకి అందించేందుకు చూస్తాడు. అయితే, ఎంఎస్ ధోనీ అభిమానులు మాత్రం తమ క్రికెటర్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకురావాలని కోరుకుంటారు. గతంలో కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా మ్యాచ్‌ పరిస్థితిని బట్టి ఆర్డర్‌లో మార్పులు చేసేవాడు. జట్టు విజయానికి అవసరమైన నిర్ణయాలు ఉంటాయి. అప్పుడు ముందే అతడి బ్యాటింగ్‌ను చూసే అవకాశం రావచ్చు’’ అని ఆసీస్‌ మాజీ కెప్టెన్ మైకెల్‌ క్లార్క్‌ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని