Mumbai vs Delhi: స్టబ్స్‌ పోరాటం వృథా.. బోణీ కొట్టిన ముంబయి

ఐపీఎల్‌-17 సీజన్‌లో ముంబయి ఖాతా తెరించింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందింది.

Updated : 07 Apr 2024 19:42 IST

ముంబయి: ఐపీఎల్‌-17 సీజన్‌లో ముంబయి ఖాతా తెరించింది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందింది. 235 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. స్టబ్స్‌ (71*; 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) పోరాటం వృథా అయ్యింది. ఓపెనర్‌ పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8 ఫోర్లు. 3 సిక్స్‌లు), అభిషేక్ పొరెల్‌ (41; 31 బంతుల్లో 5 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. ముంబయి బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 4 వికెట్లు తీయగా, బుమ్రా 2, షెఫర్డ్‌ వికెట్‌ పడగొట్టారు.

స్టబ్స్‌ మెరుపులు 

ట్రిస్టన్‌ స్టబ్స్‌ క్రీజులోకి రావడంతోనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. పీయూష్‌ చావ్లా వేసిన 13 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఆకాశ్‌ వేసిన 17 ఓవర్‌లో వరుసగా 4,6,4 బాదేసి 19 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 19 ఓవర్‌లో మూడు సిక్సర్లు రాబట్టాడు. 

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్ (42; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (45*; 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. హార్దిక్‌ పాండ్య (39: 33 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించాడు. రొమారియో షెఫెర్డ్‌ (39*; 10 బంతుల్లో) చివరి ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాది 32 పరుగులు రాబట్టాడు. దిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, నోకియా 2, ఖలీల్ అహ్మద్‌ ఒక వికెట్ తీశారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని