IPL 2023: శ్రేయస్‌కు గాయం... కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సారథిగా యువ ఆల్‌రౌండర్‌

ఐపీఎల్‌ 2023 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు కెప్టెన్‌గా యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రాణాను నియమిస్తున్నట్లు ఫ్రాంఛైజీ సోమవారం ప్రకటించింది.

Published : 28 Mar 2023 00:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్ (IPL 2023) సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) జట్టు కెప్టెన్‌గా యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ రాణా (Nitish Rana) ఎంపికయ్యాడు. గత సీజన్లలో కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) వెన్నుసర్జరీ కారణంగా ప్రస్తుత టోర్నమెంట్‌కు దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో రాణాను కెప్టెన్‌గా నియమిస్తూ కోల్‌కతా ఫ్రాంఛైజీ సోమవారం ప్రకటించింది. రాణా 2018 నుంచి కోల్‌కతా తరఫున ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడు దిల్లీకి నాయకత్వం వహించాడు. 

‘‘నితీశ్‌ జట్టులో చాలా కాలంగా ఉన్నాడు. ఎన్నోసార్లు కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడి.. కీ ప్లేయర్‌గా నిలిచాడు. అలాంటి ప్లేయర్‌ ఇప్పుడు మా జట్టును నడపబోతున్నాడు. జట్టులో ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. వారందరి సహకారంతో ఈ ఏడాది నితీశ్‌ రాణిస్తాడని ఆశిస్తున్నాం. శ్రేయస్‌ త్వరగా కోలుకొని ఈ సీజన్‌లో కొన్ని మ్యాచులైనా ఆడాలని ఆశిస్తున్నాం’’ అని కేకేఆర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. 

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో దిల్లీ తరఫున కెప్టెన్‌గా వ్యవహరించిన రాణా 12 టీ20లకు 8 విజయాలు అందించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున 74 మ్యాచులు ఆడిన అతడు 1,744 పరుగులు సాధించాడు. 135.61 స్ట్రైక్‌రేట్‌తో మిడిలార్డర్‌లో రాణిస్తున్నాడు. అలాగే ఆఫ్‌స్పిన్‌తో అవసరమైనప్పుడు వికెట్లు కూడా అందించాడు.  ఇక కేకేఆర్‌ తన తొలిమ్యాచ్‌ ఏప్రిల్‌ 1న పంజాబ్‌ కింగ్స్‌తో మొహాలీలో ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని