IND vs PAK: బహిష్కరించేంత దమ్ము పాకిస్థాన్‌ జట్టుకు లేదు: కనేరియా

భారత్‌ - పాకిస్థాన్‌.. ఒక దేశానికి మరొక జట్టు వెళ్లదు. గత పద్నాలుగేళ్లుగా తటస్థ వేదికల్లోనే తలపడుతున్నాయి. అయితే వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్‌, పాక్‌ వేదికగా ఆసియా కప్‌ జరగనుంది. ఈ క్రమంలో ఇరుదేశాల బోర్డు పెద్దలు చేసిన వ్యాఖ్యలు సంచలన రేపాయి. 

Published : 29 Nov 2022 18:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వచ్చే ఏడాది పాకిస్థాన్‌ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్‌ ఆడకపోతే.. వన్డే ప్రపంచకప్‌లో మేం ఆడేది లేదంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రజా తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే రమీజ్‌ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ‘ఏ దేశం భారత్‌ను శాసించలేదు’’ అని కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలో పాక్‌కే చెందిన మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా పీసీబీ ఛైర్మన్‌ వ్యాఖ్యలపై స్పందించాడు. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీల నుంచి వైదొలిగే దమ్ము పాక్‌కు లేదని విమర్శించాడు. 

‘‘ఐసీసీ మెగా టోర్నీలో పాక్‌ పాల్గొనకుండా ఉండే దమ్ము లేదు. ఒక వేళ అలా చేసినా పాక్‌కే నష్టం తప్ప.. భారత్‌కు కాదు. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఆడినా, ఆడకపోయినా బీసీసీఐ పట్టించుకోదు. వారికి చాలా భారీ మార్కెట్‌ ఉంది. రెవెన్యూ కూడా అదే స్థాయిలో ఉంటుంది. వన్డే ప్రపంచకప్‌ కోసం భారత్‌లో పర్యటించకపోతే పాక్‌ నష్టపోవాల్సి వస్తుంది. ఐసీసీ నుంచి ఒత్తిడి ఉంటే తప్పకుండా పాక్‌ ఆడాల్సిందేనని అధికారులు చెప్పే అవకాశం లేకపోలేదు. పాకిస్థాన్‌ ప్రస్తుత పరిస్థితినిబట్టి రమీజ్‌ రజా ఇలాంటి ప్రకటనలు చేయడం సరైంది కాదు. ఆసియా కప్‌ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఇలానే చేస్తే బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ కూడా బాయ్‌కాట్‌ చేసే ప్రమాదం లేకపోలేదు. అప్పటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చి ఏమైనా జరగొచ్చు’’ అని కనేరియా వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని