Ramiz Raja: మా వల్లే అప్పుడు భారత్‌ కెప్టెన్‌ను మార్చింది: రమీజ్‌ రజా

పాకిస్థాన్‌ ఓడితే చాలు టీమ్‌ఇండియాపై మాటలతో పడిపోవడం రమీజ్‌ రజాకి అలవాటు. పీసీసీ చీఫ్‌గా తన హయాంలో భారత్‌పై గెలవడంతో రెచ్చిపోతుంటాడు. అయితే తన పదవి పోయినా మాత్రం టీమ్‌ఇండియాపై అక్కసు మాత్రం వెళ్లగక్కడంలో మాత్రం ఆగలేదు. 

Published : 29 Dec 2022 22:16 IST

ఇంటర్నెట్ డెస్క్: చింత చచ్చినా పులుపు చావలేదనట్లుగా.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్ పదవి పోయినా రమీజ్‌ రజా భారత్‌ జట్టుపై అక్కసు మాత్రం వెళ్లగక్కుతూనే ఉన్నాడు. బలవంతంగా ఆ పదవి నుంచి తప్పించినా సరే తన గొప్పలను చెప్పడంలో తగ్గడం లేదు. ప్రగల్భాలకు పోయి విమర్శలకు గురవుతూనే ఉన్నాడు. తన హయాంలో పాకిస్థాన్‌ సాధించిన విజయాలను చెబుతూనే.. టీమ్‌ఇండియాను తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేశాడు. 

రమీజ్ రజా క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నప్పుడు పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌ 2021 సెమీఫైనల్‌తోపాటు 2022 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ వరకు వెళ్లింది. వైట్‌బాల్‌ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిందని.. దాంతో భారత క్రికెట్‌లో చాలా మార్పులకు కారణమైందని పేర్కొన్నాడు. ‘‘మా జట్టు అద్భుతంగా ఆడింది.  ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరాం. భారత్‌ మాత్రం సరిగ్గా ఆడలేకపోయింది. బిలియన్‌ డాలర్ల సంపద కలిగిన జట్టు మా కంటే వెనుకబడింది. దీంతో చీఫ్ సెలెక్టర్, సెలెక్షన్ కమిటీతోపాటు కెప్టెన్‌ను కూడా తప్పించి మార్పులు చేసింది. ఇదంతా వారి కంటే పాక్‌ ముందుకు వెళ్లడమే కారణం. బాబర్‌ అజామ్‌ నాయకత్వంలోని పాక్‌ బలోపేతమైంది. జట్టును ఐక్యంగా  ఉంచాం’’ అని రమీజ్‌ రజా తెలిపాడు. 2021 టీ20 ప్రపంచకప్‌ తర్వాత విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదులుకోగా.. రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది.

స్వదేశంలో ఇంగ్లాండ్‌ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌ను పాక్‌ 3-0 తేడాతో కోల్పోవడంతో పీసీబీ ఛైర్మన్‌తోపాటు సెలెక్షన్‌ కమిటీపై పాక్‌ ప్రభుత్వం వేటు వేసింది. రమీజ్‌ రజాను తొలగించి ఆ స్థానంలో నజామ్‌ సేథిని పాక్ సర్కార్‌ నియమించింది. అలాగే ఇంజమామ్‌ స్థానంలో షాహిద్ అఫ్రిదిని తాత్కాలిక సెలెక్షన్ కమిటీ చీఫ్‌గా నియమితులయ్యాడు. కెప్టెన్‌ బాబర్‌ మీదా వేటు వేయాలనే డిమాండ్లు అక్కడ వినబడుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని