IND vs AUS: భారత్, ఆసీస్ మధ్య ఫైనల్.. ముందే జోస్యం చెప్పిన మిచెల్ మార్ష్‌

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్, ఆసీస్ తలపడతాయని ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) కొన్ని నెలల కిందట అన్నాడు. ఇప్పుడు అతడి అంచనా నిజం కావడంతో నెట్టింట చర్చ జరుగుతోంది.

Updated : 18 Nov 2023 15:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ (ODI World Cup Final)లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) తలపడతాయని ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్‌ (Mitchell Marsh) కొన్ని నెలల కిందట చెప్పాడు. అయితే, అతడు గాలివాటంగా అన్న మాటలు యాదృచ్చికంగా ఇప్పుడు నిజమయ్యాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో దిల్లీ తరఫున ఆడిన సమయంలో ప్యాడ్‌కాస్ట్‌తో మిచెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆస్ట్రేలియా అజేయంగా ఫైనల్‌కు చేరుతుంది. భారత్‌ను ఓడిస్తుంది. ఫైనల్‌లో ఆసీస్‌ 450/2 స్కోరు చేస్తుంది. టీమ్ఇండియాను మాత్రం మేం 65 పరుగులకే ఆలౌట్‌ చేసేస్తాం’’ అని అతడు వ్యాఖ్యానించాడు. మార్ష్‌ చెప్పినట్టుగానే భారత్, ఆసీస్ ఫైనల్‌లో తలపడుతుండటంతో నెట్టింట దీనిపై చర్చ జరుగుతోంది. అయితే, ఆసీస్‌కు అంత సీన్‌ లేదని.. మ్యాచ్‌లో భారత్ తప్పక విజయం సాధించి 2003 ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందని టీమ్‌ఇండియా ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఒక్క టికెట్ రూ.1.87 లక్షలు..

క్రికెట్.. ఇంగ్లాండ్‌లో పుట్టినా.. ఆ ఆటకు ఎక్కువ ఆదరణ ఉన్నది మాత్రం ఇండియాలో. భారత్‌లో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌ మ్యాచ్‌లకు అభిమానులు పోటెత్తారు. లీగ్ దశలో భారత్, పాకిస్థాన్‌.. న్యూజిలాండ్‌తో టీమ్‌ఇండియా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు స్టేడియాలు నిండిపోయాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లకూ ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో కొంతమంది ఇదే అదనుగా భావించి ఏకంగా లక్షల రూపాయలకు టికెట్లు అమ్మకానికి పెడుతున్నారు.  ఓ టికెట్‌ రీ సేలింగ్‌ వెబ్‌సైట్‌లో టైర్ 4లో టికెట్ ధర ఏకంగా రూ. 1,87,407 కాగా చూపిస్తోంది. పక్కనే ఉన్న టైర్ టికెట్ ధర రూ. 1,57,421గా ఉంది. ఈ వెబ్‌సైట్‌లో అతి తక్కువగా ఉన్న టికెట్ ధర రూ.32,000. ఈ ధరలను చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని