Rahul Dravid: ప్రయోగాలు ఊరకే చేయం.. వాటికీ కారణాలుంటాయ్‌.. రాహుల్ ద్రవిడ్

టీమ్‌ఇండియా మిడిల్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేయడానికి గల కారణాలను భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వివరించాడు.

Published : 30 Aug 2023 01:47 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌నకు సమయం దగ్గరపడుతున్నా భారత జట్టు (Team India)లో కచ్చితంగా ఈ ఆటగాడు ఉంటాడని చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా తుది జట్టు కూర్పు ఎలా ఉంటుంది, మిడిల్ ఆర్డర్‌లో ఏ స్థానంలో ఆడతాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ పరిస్థితి తలెత్తడానికి కారణాలు లేకపోలేదు. రిషభ్‌ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా గాయాల బారిన పడటంతో మిడిల్ ఆర్డర్‌లో ఆటగాళ్లను మారుస్తూ వచ్చారు. దీంతో ఆటగాళ్ల స్థానాలపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసియా కప్‌ కోసం శ్రీలంకకు బయలుదేరే ముందు నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. టీమ్ మేనేజ్‌మెంట్ దాదాపు 18 నెలల క్రితమే వన్డే ప్రపంచ కప్ (World Cup 2023) కోసం నాలుగు, ఐదు స్థానాల్లో ఏ ఆటగాళ్లు ఆడాలనే దానిపై నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు. అయితే, స్వల్ప వ్యవధిలో ముగ్గురు ఆటగాళ్లు గాయపడటంతో ఇటీవల కాలంలో ఇతర ఆటగాళ్లను మిడిల్ ఆర్డర్‌లో ఆడించామని పేర్కొన్నాడు. 

ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరుడు అతడే: వివియన్ రిచర్డ్స్‌

‘‘బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగు, ఐదు స్థానాల గురించి చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ఆ స్థానాల్లో ఎవరు ఆడాలనే దానిపై మాకు స్పష్టత లేదనే ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ రెండు స్థానాల కోసం 18-19 నెలల ముందుగానే ముగ్గురు ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకున్నాం. వారేవరో కాదు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌. కానీ, దురదృష్టవశాత్తు ఈ ముగ్గురు కొన్ని నెలల వ్యవధిలో గాయాల బారినపడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రపంచకప్‌ నాటికి ఈ ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోతే ఆ స్థానాల్లో ఎవరు రాణించగలరో తెలుసుకోవడం కోసం కొంతమందిని ఆడించాం. వీటి గురించి ఆలోచించకుండానే ప్రయోగాలు చేస్తున్నామని అంటున్నారు. కొన్నిసార్లు ఇలా చేయడానికి నిర్దిష్టమైన కారణాలు ఉంటాయి. శ్రేయస్ అయ్యర్‌ కోలుకున్నాడు. ఇప్పుడు అతడికి ఆడే అవకాశాలివ్వాలి. ఆసియా కప్‌లో ఛాన్స్‌లు ఇచ్చి ప్రపంచ కప్‌ కోసం అతడిని సిద్ధం చేయగలమని భావిస్తున్నా. ప్రస్తుతం అతడు అన్ని విధాలుగా మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాడు’’ అని రాహుల్ ద్రవిడ్ వివరించాడు. మరోవైపు, ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని