PCB: 3-0తో పాక్‌ ఓటమి... క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌పై వేటు..!

పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా(Ramiz Raja)పై పాక్‌ ప్రధాని వేటు వేశారు. అతడిని పదవి నుంచి తొలగిస్తూ నోటిఫికేషన్‌  జారీ చేశారు.

Updated : 22 Dec 2022 13:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రజా(Ramiz Raja)పై ప్రభుత్వం వేటు వేసింది. అతడిని పీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించింది. ఈ మేరకు బుధవారం అర్ధరాత్రి పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనిని మంత్రి వర్గం ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. రజా(Ramiz Raja) స్థానంలోని నజమ్‌ సేథీ అధ్యక్షుడిగా 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే నాలుగు నెలలు సేథీ ఈ పదవిలో కొనసాగనున్నారు.

అంతేకాదు.. 2019లో చేసిన పీసీబీ రాజ్యాంగాన్ని కూడా రద్దు చేశారు. 2014లో రద్దు చేసిన రాజ్యాంగాన్ని మళ్లీ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త కమిటీలో షాహిద్‌ అఫ్రిది, హరూన్‌ రషీద్‌, మహిళా క్రికెటర్‌ సనా మిర్‌ కూడా స్థానాలు దక్కించుకున్నారు. 

రజా(Ramiz Raja) గత 15 నెలలుగా పీసీబీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయనను ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వం 2021 సెప్టెంబర్‌లో నియమించింది. ఇషాన్‌ మణీ నుంచి రజా(Ramiz Raja) ఈ బాధ్యతలను స్వీకరించారు. ఇక కొత్తగా నియమితులైన సేథీ కూడా 2013-18 వరకు పాక్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌, సీఈవోగా పనిచేశారు. తాజా పరిణామాలపై పాక్‌ ప్రభుత్వం, పీసీబీ, రజా(Ramiz Raja) ఇప్పటి వరకు స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని