Jadeja Or Ashwin: జడేజా లేదా అశ్విన్‌.. గావస్కర్‌ ఛాయిస్‌ ఎవరంటే..!

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉండటంతో జట్టు ఎంపికపై అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్లు ఇప్పటికే తుది జట్టు ఎంపికపై అంచనాలు వెల్లడించారు. 

Published : 05 Jun 2023 10:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డబ్ల్యూటీసీ (ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌) ఫైనల్స్‌కు కేవలం 48 గంటలు మాత్రమే ఉండటంతో తుది జట్టు ఎంపికపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సరైన జట్టుతో బరిలోకి దిగితే భారత్‌ జట్టు కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఐసీసీ ట్రోఫీ కరవును ఇది తీర్చేస్తుంది. దీంతోపాటు రోహిత్‌ కెప్టెన్సీలో ఓ చిరస్మరణీయ విజయం నమోదవుతుంది. ఓవల్‌ పిచ్‌ సీమర్లకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతుండటంతో భారత్‌ తుది జట్టులో ఒకే స్పిన్నర్‌కు అవకాశం లభించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆల్‌రౌండర్లు జడేజా (Ravindra Jadeja), అశ్విన్‌ (Ravichandran Ashwin) మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వీరిద్దరూ భారత్‌లో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుతంగా రాణించారు. దీంతో వీరిలో నుంచి ఒకరికి మాత్రమే స్థానం లభించే అవకాశం ఉంటే మాత్రం.. ఎంపిక టీమ్‌ఇండియా యాజమాన్యానికి కత్తిమీద సాములా మారనుంది. మరో వైపు కీపర్‌ స్థానం కోసం భరత్‌, ఇషాన్‌ మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొంది.

ఈ నేపథ్యంలో లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) డబ్ల్యూటీసీ (World Test Championship) ఫైనల్స్‌ కోసం తన డ్రీమ్‌ టీమ్‌ ఇండియా జట్టును వెల్లడించాడు. దీనిలో చాలా ఆశ్చర్యకరమైన ఎంపికలు కూడా ఉన్నాయి. తుదిజట్టులో కీపర్‌గా కేఎస్ భరత్‌ను ఎంపిక చేసేందుకు ఆయన మొగ్గు చూపాడు. దీంతో పాటు ఓవల్‌ పిచ్‌పై తాను ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతానని వెల్లడించాడు.  ‘‘నేను బ్యాటింగ్‌ విభాగంలో రోహిత్‌, గిల్‌, పుజారా, విరాట్‌, రహానెను ఎంచుకొంటాను. ఇక ఆరో స్థానంలో భరత్‌, కిషన్‌ మధ్య పోటీ ఉంది. ఇప్పటి వరకు భరత్‌ కుదురుగా ఆడటంతో.. అతడి వైపు మొగ్గుచూపుతాను. ఇక బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు వస్తే ఎండ ఎక్కువగా ఉంటే.. అశ్విన్‌, జడేజాను తీసుకొంటాను. ఇక పేస్‌ విభాగంలో షమీ, సిరాజ్‌, శార్ధూల్‌ ఉంటారు’’ అని పేర్కొన్నారు.

ఇప్పటికే ఆఫ్‌ స్పిన్‌ టర్బోనేటర్‌ హర్బజన్‌ సింగ్‌ కూడా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్ల ఎంపికకే ఓటేశాడు. అతడు అంచనావేసిన తుదిజట్టులో కూడా కేఎస్‌ భరత్‌కు స్థానం కల్పించాడు. మొత్తం మీద టీమ్‌ ఇండియా ఎంపికలో స్పిన్నర్లు, కీపరే కీలకం కానున్నారు. ప్రధాన బ్యాటింగ్‌ లైనప్‌లో అనుకోని ఘటనలు లేకపోతే ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని