WPL: అదరగొట్టిన పెర్రీ.. ముంబయి చిత్తు.. ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Updated : 12 Mar 2024 23:13 IST

 దిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో భాగంగా ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబయిని 7 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలుత బౌలింగ్‌, తర్వాత బ్యాటింగ్‌లో అదరగొట్టిన పెర్రీ బెంగళూరును ఒంటిచేత్తో గెలిపించింది. ముంబయి నిర్దేశించిన 114 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 39 పరుగులకే మూడు వికెట్లు పడ్డప్పటికీ ఎలిస్‌ పెర్రీ (40: 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రిచా ఘోష్‌ (36: 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోవికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ నిర్మించారు. ముంబయి బౌలర్లలో షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, హేలీ మ్యాథ్యూస్‌, నాట్‌సీవర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. పెర్రీ విజృంభణతో 19 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సజన(30), హెలీ మ్యాథ్యూస్‌(26) మినహా మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. 65 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన ముంబయి ఆతర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుంది. బెంగళూరు బౌలర్లలో పెర్రీ ఆరు వికెట్లు పడగొట్టగా, సోఫీ మోలినిక్స్‌, సోఫీ డివైన్‌, ఆశ, శ్రేయాంక ఒక్కో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌తో ముంబయి, ఆర్సీబీ జట్లు తమ లీగ్‌ మ్యాచ్‌లను ముగించాయి. ఇక ఇప్పటికే ముంబయి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దిల్లీ దాదాపు ఫైనల్‌కు చేరినట్లే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడంతో మరో రెండు జట్లు యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ ఇంటిబాట పట్టాయి. దిల్లీ, గుజరాత్‌ మధ్య మరో నామమాత్రమైన పోరు మిగిలి ఉంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని