Ricky ponting: భారత టీ20 లీగ్‌ వేలం.. గ్రీన్‌ను కొనుగోలు చేయనున్న దిల్లీ?

రానున్న భారత టీ20 లీగ్‌ వేలంలో ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌పై ఆసక్తి చూపుతున్నట్టుగా దిల్లీ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. 

Published : 30 Nov 2022 18:42 IST

దిల్లీ: ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌కు భారత టీ20 లీగ్‌లో భారీగా డిమాండ్‌ వచ్చే అవకాశముంది. తాజాగా దిల్లీ జట్టు ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. వచ్చే సీజన్‌లో గ్రీన్‌ను కొనుగోలు చేసేందుకు తాము భారీ సొమ్మును ఏర్పాటు చేసుకున్నట్లుగా రికీ తెలిపాడు. బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. 

‘‘వచ్చే ఏడాది భారత టీ20 లీగ్‌ నేపథ్యంలో నేను కామెరూన్‌ గ్రీన్‌ గురించి మాట్లాడటానికి ఆసక్తిగా ఉన్నాను. ఎందుకంటే ఈ వేలం కోసం మేం భారీ మొత్తాన్నే మిగుల్చుకున్నాం’’ అంటూ తెలిపాడు. ఇప్పటికే గ్రీన్‌ ఈ టీ20 లీగ్‌ వేలంలో తన పేరును నమోదు చేసుకొన్నాడు. ఈ టోర్నమెంట్‌ తన భవిష్యత్తుకు మరింత మంచి బాటలు వేస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. అదే సమయంలో ఈ ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ యువ బ్యాటర్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధశతకాలు సాధించాడు. తొలి టీ20లో భారత్‌ నిర్దేశించిన 209 భారీ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. రిషభ్‌ పంత్‌ నేతృత్వంలోని దిల్లీ జట్టు ఈ సారి ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌తో పాటుగా టిమ్ సీఫెర్ట్‌, అశ్విన్‌ హెబ్బర్‌, శ్రీకర్‌ భరత్‌, మన్‌దీప్‌ సింగ్‌ను వదిలేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని