Rishabh Pant: పంత్‌, ఆమ్రె, శార్దూల్ ఠాకూర్‌లకు భారీ జరిమానా

టీ20 లీగ్‌లో దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, ఆ జట్టు ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, సహాయక కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రెలకు టోర్నీ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు...

Published : 23 Apr 2022 15:54 IST

(Photos: Rishabh Pant, Shardul Thakur Instagrams)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 లీగ్‌లో దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, ఆ జట్టు ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, సహాయక కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రెలకు టోర్నీ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. గతరాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో నోబాల్‌ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ ముగ్గురు ప్రవర్తించిన తీరు లెవెల్‌-2 కింద నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ నిర్వహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఈ ముగ్గురి మ్యాచ్‌ ఫీజులో భారీ కోత విధిస్తున్నట్లు కూడా వెల్లడించారు.

రాజస్థాన్‌ బౌలర్‌ ఒబెడ్‌ మెకాయ్‌ వేసిన మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌ మూడో బంతిని దిల్లీ బ్యాట్స్‌మన్‌ రోమన్‌ పావెల్‌ (36) సిక్సర్‌గా మలిచాడు. ఆ బంతి నో బాల్‌గా అనిపించడంతో దిల్లీ ఆటగాళ్లు దాన్ని పరిశీలించాలని అంపైర్లను కోరారు. అయితే, దానికి వారు అంగీకరించకపోవడంతో అసహనానికి గురైన పంత్‌.. తమ ఆటగాళ్లను మైదానం వీడి రావాలని సూచించాడు. అలాగే శార్దూల్‌ కూడా అలాంటి సైగలే చేశాడు. దీంతో పాటు వారిద్దరూ డగౌట్‌లోనే పక్కనే ఉన్న మరో అంపైర్‌తోనూ వాదనకు దిగారు. ఆపై పంత్‌.. తమ సహాయక కోచ్‌ ఆమ్రెను మైదానంలోకి పంపించి అంపైర్లతో మాట్లాడాలని చెప్పాడు. దీంతో ఆయన మైదానంలోకి వెళ్లాడు.

ఈ నేపథ్యంలోనే ముగ్గురిపైనా చర్యలు తీసుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పంత్‌ మ్యాచ్‌ ఫీజులో 100శాతం, శార్దూల్‌ ఫీజులో 50 శాతం కోత విధించగా అసిస్టెంట్‌ కోచ్‌ ఆమ్రెకు 100 శాతం ఫీజ్‌ కోతతో పాటు ఒక మ్యాచ్‌ నిషేధం కూడా విధించారు. కాగా, వీరు తమ నేరాన్ని అంగీకరించినట్లు కూడా అందులో వివరించారు. దిల్లీ ఈ ఓటమితో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, నాలుగు ఓటములు చవిచూసింది. ఇక తర్వాత మ్యాచ్‌ ఈ నెల 28న కోల్‌కతాతో ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని