Rohit: భారీ స్కోరు బాకీ ఉందని తెలుసు.. కానీ నాకు కంగారేమీ లేదు: రోహిత్‌

న్యూజిలాండ్‌పై మూడు వన్డేల సిరీస్‌ను (IND vs NZ 2023) టీమ్‌ఇండియా (Team India) మరొక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకొంది. తక్కువ స్కోర్లు నమోదైన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఇప్పటి వరకు మూడంకెల స్కోరును సాధించలేదనే వ్యాఖ్యలపై  రోహిత్ స్పందించాడు.

Updated : 22 Jan 2023 12:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ దూకుడుగా ఆడతాడు. అయితే వన్డేల్లో సెంచరీ కొట్టి దాదాపు రెండేళ్లవుతోంది. కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. తాజాగా న్యూజిలాండ్‌పై అర్ధశతకం సాధించాడు. గత కొంతకాలంగా మూడంకెల స్కోరు సాధించకపోవడంపై రోహిత్ శర్మ స్పందించాడు. 

‘‘ఇప్పుడు నేను నా గేమ్‌ను మార్చుకొనేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా. బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తున్నా. ఒత్తిడి తేవడం చాలా ముఖ్యమనేది నా భావన. ఇక గత కొంతకాలంగా భారీ స్కోర్లు చేయలేదనే విషయం నాకూ తెలుసు. అయితే దాని గురించి పెద్దగా కంగారేమీ లేదు. ఇప్పుడు నా బ్యాటింగ్‌తో ఆనందంగానే ఉన్నా. అయితే నా బ్యాటింగ్‌ అప్రోచ్‌ను మాత్రం నాతోనే ఉంచుకున్నా. భారీ స్కోరు బాకీ ఉందని నాకు తెలుసు’’ అని అన్నాడు.

రెండో వన్డేలో కివీస్‌ను కుప్పకూల్చిన బౌలర్లను రోహిత్ అభినందించాడు. ‘‘గత ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మనం ఎలాంటి ఫలితం కావాలని అడిగామో.. అలాంటి డెలివరీలనే బౌలర్లు సంధించారు. భారత్‌ వేదికగా సూపర్‌ బౌలింగ్‌ చేశారు. విదేశాల్లోనూ ఇదే ప్రదర్శనను ఆశిస్తున్నారు. అయితే భారత బౌలర్లు ఉత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లే. కివీస్‌తో రెండో వన్డేలో మావాళ్లు అదరగొట్టారు. ఈ పిచ్‌పై 250 పరుగులైనా ఛేదించగలమని భావించాం. బౌలర్లు చక్కగా బౌలింగ్‌ చేసి కివీస్‌ను కుప్పకూల్చారు. షమీ, సిరాజ్‌ లాంగ్‌ స్పెల్‌ వేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే వారికి ముందు టెస్టు సిరీస్‌ (ఆసీస్‌తో) ఉందని గుర్తు చేశా. అందుకే పూర్తి ఓవర్లపాటు బౌలింగ్‌ వేయించలేదు’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. 

మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. తొలుత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో కివీస్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (51)తోపాటు శుభ్‌మన్‌ గిల్‌ (40*) రాణించాడు. దీంతో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వన్డే మ్యాచ్‌ ఇందౌర్‌ వేదికగా మంగళవారం జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని