
IND vs SA : దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. టీమ్‌ఇండియాలోజోష్ కనిపించలేదు: భట్
ఇంటర్నెట్ డెస్క్: అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన విరాట్ కోహ్లీ ఐదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో బ్యాటర్‌గా తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ అర్ధశతకం సాధించినా భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో కోహ్లీతోపాటు జట్టు ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ సారథి సల్మాన్ భట్ తనదైన శైలిలో విశ్లేషించాడు. కెప్టెన్‌గా కోహ్లీ అందించే ఎనర్జీ.. మొదటి వన్డేలో మిస్ అయిందన్నాడు. భారత క్రికెట్ జట్టులో మార్పులు, కోహ్లీ సారథ్యానికి వీడ్కోలుపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా వైద్య పరిభాషలో ఛలోక్తి విసిరాడు. ‘‘వ్యక్తికి ఆరోగ్యం బాగున్నా సరే మందులు ఇచ్చేందుకు కొంతమంది వైద్యులు ఆసక్తి చూపుతుంటారు. కాబట్టి డాక్టర్ (బీసీసీఐ) వస్తున్నాడంటే మెడిసిన్ వస్తుందని గ్రహించాలి. ఎలాంటి కారణం లేకుండానే దురదృష్టవశాత్తూ పలు సంఘటనలు జరిగిపోతుంటాయి’’ అని పేర్కొన్నాడు.
‘‘ విరాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు వచ్చే ఉత్సాహం, ఎనర్జీ దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో కనిపించలేదు. ఇది కొంతమంది వల్లే జరుగుతుంది. వారు సారథిగా ఉన్నప్పుడు ఆ జోష్ వేరేగా ఉంటుంది. అయితే కెప్టెన్‌గా ఉన్న ఆటగాడి నుంచి మొదటి వన్డేలో ఆ దూకుడు కనిపించలేదు. దాని కోసం ప్రయత్నించాలి. కేఎల్ రాహుల్‌లో చూడలేకపోయా. అంతేకాకుండా తర్వాతి మ్యాచ్‌లో గెలవాలంటే కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్ స్థానానికి రావడమే సత్వర పరిష్కారం. ఇంకో బ్యాటర్‌ను అదనంగా జట్టులోకి తీసుకోవాలి. అలానే భువనేశ్వర్ బదులు మంచి ఫాస్ట్ బౌలర్‌ను ఎంచుకోవాలి. సరైన బ్యాటర్‌ను ఓపెనింగ్‌కు పంపితే ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచినట్లు అవుతుంది. తర్వాత మిడిలార్డర్ అనుభవం పనికొస్తుంది’’ అని భట్ విశ్లేషించాడు.