IND vs PAK: మోదీజీ.. భారత్‌- పాక్‌ మధ్య మ్యాచ్‌లు జరిగేలా చూడండి: షాహిది అఫ్రిది

భారత్‌-పాక్‌ (IND vs PAK) మధ్య తిరిగి ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే చూడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్ అఫ్రిది కోరాడు.

Published : 22 Mar 2023 02:22 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో భారత్ ‌- పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య జరిగే మ్యాచ్‌కు ఉండే  క్రేజే వేరు. మ్యాచ్‌ ఎక్కడ జరిగినా  అభిమానులతో మైదానం కిక్కిరిసిపోయి చప్పట్లు, ఈలలతో స్టేడియం మార్మోగుతుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన భారత్‌ - పాక్‌ మ్యాచ్‌ సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 90వేల మంది ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించారు. ఇక, టీవీలు, డిజిటల్ విధానంలో కోట్లాది ప్రేక్షకులు మ్యాచ్‌ని చూశారు. అయితే 2007 తర్వాత ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. భారత్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతుండటమే ఇందుకు కారణం. ఇరుజట్లు కేవలం ఐసీసీ (ICC), ఆసియా కప్‌ టోర్నీల్లో మాత్రమే పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్-పాక్‌ మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా చూడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)ని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (Shahid Afridi) కోరాడు.

‘‘రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరిగేలా చూడాలని నేను నరేంద్ర మోదీజీని అభ్యర్థిస్తున్నాను’’ అని అఫ్రిది అన్నాడు. బీసీసీఐ (BCCI) చాలా బలమైన బోర్డుగా ఉందని, అయితే అది తమను శత్రువులుగా చూడటానికి ప్రయత్నించొద్దని.. దానికి బదులుగా స్నేహితులుగా మారే విధంగా బీసీసీఐ కృషి చేయాలన్నారు. “మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నా.. అతను మనతో మాట్లాడకపోతే మనం ఏమి చేయగలం?  బీసీసీఐ  చాలా బలమైన బోర్డు అనడంలో సందేహం లేదు. కానీ, మీరు బలంగా ఉన్నప్పుడు మీకు మరింత బాధ్యత ఉంటుంది. మీరు ఎక్కువ మంది శత్రువులను తయారు చేసుకోవడానికి ప్రయత్నించవద్దు. ఎక్కువ మందిని స్నేహితులుగా చేసుకోవాలి. తద్వారా ఇంకా బలంగా తయారవుతారు’’ అని షాహిది అఫ్రిది అన్నాడు. దోహాలో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC)లో అఫ్రిది ఆడుతున్నాడు. ఈ సందర్భంగా పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని