Shoaib Malik: అప్పుడు క్యాచ్‌ వదిలేశాం..అదో సరదా సందర్భం!: షోయబ్‌ మాలిక్‌

2008లో దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థానీ క్రికెటర్లు షోయబ్‌ మాలిక్‌, సయిద్‌ అజ్మల్‌ అత్యంత సులభమైన క్యాచ్‌ను వదిలేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

Published : 17 Mar 2023 01:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో పాకిస్థానీ క్రికెటర్లు షోయబ్‌ మాలిక్‌(Shoaib Malik),  అజ్మల్‌(Saeed Ajmal) అత్యంత సులభమైన క్యాచ్‌ను వదిలేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ‘క్రికెట్‌ కహానీ’ అనే షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మాలిక్‌ దీని గురించి ప్రస్తావిస్తూ అదొక సరదా సందర్భమన్నాడు. పాకిస్థానీ బౌలర్‌ మహమ్మద్‌ అమీర్‌, ఆల్‌రౌండర్‌ వాసిమ్‌ హైదర్‌లను ఇంటర్వ్యూ చేస్తూ పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2017 సమయంలో ఆ క్యాచ్‌ గురించి వచ్చిన చర్చను ముందుగా మహమ్మద్‌ అమీర్ గుర్తు చేశాడు. ‘‘మేము ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ గెలిచిన సమయం మీకు గుర్తుందా? సయిద్‌ అజ్మల్‌ వదిలేసిన క్యాచ్‌ గురించి అప్పుడు మీరు మాకు వివరిస్తున్నారు.ఆ సమయంలో విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, అజర్‌ అలీ, మీరు, నేను అందరం నిల్చొని ఉన్నాం. అతడు ఆ క్యాచ్‌ను ఎలా వదిలేశాడో మీరు వివరిస్తుంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. మీరు చెప్పిన విధానం ఆరోజు నాకు చాలా నవ్వు తెప్పించింది’’ అని అమీర్‌ తెలిపాడు.

దీనికి మాలిక్‌ బదులిస్తూ..‘‘ అజ్మల్‌ అప్పుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ సందర్భాన్ని ఎప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వొస్తుంది. అతడు కూర్చొని ఉన్నాడు. అతడి చేతులు పువ్వు మాదిరి తెరుచుకొని ఉన్నాయి. అతడు క్యాచ్‌ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ బంతి అతడి చేతులకు దూరంగా పడింది. నా తప్పేంటంటే క్యాచ్‌ నేను పట్టి ఉండాల్సింది. కానీ నేను అతడి చేతులను చూశాను. క్యాచ్ అందుకోవడం అతడికి చాలా సులభమమని భావించాను. ‘ఆ క్యాచ్‌ నువ్వు ఎందుకు పట్టుకోలేదు ?’ అని నేను అతడిని ప్రశ్నించాను. దానికి అతడు ‘ ఒకవేళ నువ్వు ఆ క్యాచ్‌ వదిలేస్తే నేను అందుకుందామని చేతులు చాచి తయారుగా ఉన్నాను’ అని సమాధానమిచ్చాడు. అదొక సరదా సందర్భం. అతడు అందరినీ చాలా నవ్విస్తాడు’’ అని మాలిక్‌ వివరించాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు