WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే.. జట్టులో రాహుల్‌ లేదా గిల్‌? డీకే సమాధానమిదే!

భారత్ - ఆస్ట్రేలియా సిరీస్‌లో (IND vs AUS) ఘోరంగా విఫలమైన బ్యాటర్లలో సీనియర్‌ ఆటగాడు కేఎల్ రాహుల్‌ ఒకడు. ఈ క్రమంలో అతడి స్థానంపై అనుమానాలు రేకెత్తాయి.

Published : 13 Mar 2023 11:44 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల టెస్టుల్లో ఘోర ప్రదర్శనతో విమర్శలు రావడంతో  కేఎల్‌ రాహుల్‌ను (KL Rahul) తుది జట్టులో నుంచి తప్పించారు. అతడి స్థానంలో వచ్చిన యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ ఆసీస్‌తో నాలుగో టెస్టులో (IND vs AUS) సెంచరీ సాధించాడు. దీంతో గిల్‌ను తదుపరి మ్యాచ్‌లకు తప్పించడం దాదాపు కష్టమే. ఈ క్రమంలో ఒకవేళ టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్తే తుది జట్టులో ఎవరు ఉండాలన్న దానిపై చర్చకు తెరలేసింది. ఇదే విషయంపై టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ స్పందించాడు. కేఎల్ రాహుల్‌ను కీపర్‌ బ్యాకప్‌ ఆప్షన్‌గా ఉపయోగించుకోవచ్చని సూచించాడు. 

‘‘టెస్టు క్రికెట్‌ ఇతర ఫార్మాట్లతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. కేఎల్‌ రాహుల్‌ టెస్టుల్లో వికెట్ కీపింగ్‌ను ఆస్వాదించే వ్యక్తి కాదని నాకు తెలుసు. అయితే, కేఎల్‌ వికెట్‌ కీపింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉంటే మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అతడిని బ్యాకప్‌గా పెట్టుకోవచ్చు. యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ ప్రదర్శన అద్భుతం. ఒకవేళ భారత్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటే.. గిల్‌నే ఓపెనర్‌గా చూడాలని ఉంది. అతడు రేసు గుర్రంలాంటివాడు. అందుకే, పదేళ్ల తర్వాత(2033) కూడా శుభ్‌మన్ గిల్‌నే టీమ్‌ఇండియా తరఫున ఓపెనర్‌గానూ చూడాలని నేను అనుకుంటున్నాను’’ అని కార్తిక్‌ తెలిపాడు.

ప్రస్తుతం ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. తొలి మూడు టెస్టుల్లో గొప్పగా రాణించకపోయినా.. నాలుగో టెస్టులో మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కీపింగ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌ వెళ్లినా.. కేఎస్‌కు అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు కేఎల్‌ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకొనేందుకు కూడా అవకాశం ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. జూన్‌ నాటికి శ్రేయస్‌ సిద్ధం కాకపోతే అతడి స్థానంలో కేఎల్‌కు ఛాన్స్‌ ఇవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని