Mohammed Siraj: సిరాజ్‌ తప్పిదం.. దక్షిణాఫ్రికాకు ‘బౌండరీ’ గిఫ్ట్‌

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బౌలర్‌ సిరాజ్‌ చేసిన రనౌట్‌ ప్రయత్నం విఫలమైంది. 

Updated : 10 Oct 2022 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లలో కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే చివర్లో అతడు చేసిన ఓ పొరబాటు కారణంగా దక్షిణాఫ్రికాకు నాలుగు పరుగులు అదనంగా సమర్పించుకోవాల్సి వచ్చింది.

సిరాజ్‌ వేసిన 48వ ఓవర్‌ రెండో బంతి కేశవ్‌ మహరాజ్‌ బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌కు తగిలింది. ఆ తర్వాత వికెట్ల వెనుక ఉన్న కీపర్‌ సంజూ శాంసన్‌ బంతిని ఆపి  తిరిగి సిరాజ్‌కు విసిరాడు. అయితే అదే సమయంలో నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న డేవిడ్‌ మిల్లర్‌ క్రీజు వెలుపల కన్పించాడు. అప్పటికే అసహనంతో ఉన్న సిరాజ్‌ బంతిని నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ స్టంప్స్‌ వైపు విసిరేశాడు. మిడాన్‌లో ఫీల్డర్‌ ఎవరూ లేకపోవడంతో నేరుగా బౌండరీని తాకింది. దీంతో దక్షిణాఫ్రికాకు బైస్‌ రూపంలో అదనంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్‌ ధావన్‌, బౌలర్‌ సిరాజ్ అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని