Aiden Markram: ధోనీ అపార జ్ఞాని.. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో చూడాలనేదే నా కోరిక: మార్‌క్రమ్‌

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023)లోని కొత్త సారథిగా ఎదెన్ మార్‌క్రమ్‌ (Aiden Markram)  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) నియమించిన విషయం తెలిసిందే.

Published : 24 Feb 2023 01:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి (Sunrisers Hyderabad) కెప్టెన్‌గా ఎదెన్ మార్‌క్రమ్‌ (Aiden Markram) ఎంపికైన సంగతి తెలిసిందే.  ఇప్పటికే సారథిగా  దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ జట్టును విజేతగా నిలపడంతో.. ఎస్‌ఆర్‌హెచ్‌ కూడా తన ఫ్రాంచైజీకి అతడినే కెప్టెన్‌గా నియమిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా నియామకం కావడంపై మార్‌క్రమ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా టీమ్‌ఇండియా మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) అద్భుత జ్ఞానసంపన్నుడని కొనియాడాడు. అతడి సారథ్య శైలి ప్రత్యేకమైందని ప్రశంసలు కురిపించాడు. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోకి (SA T20) భారత్‌ నుంచి ఎవరినైనా తీసుకురావాలని భావిస్తే మాత్రం తప్పకుండా తాను ఎంఎస్ ధోనీ వైపే మొగ్గుచూపుతానని తెలిపాడు. అతడి అనుభవం యువ క్రికెటర్లకు దిక్సూచిగా పని చేస్తుందని పేర్కొన్నాడు. 

‘‘ఎంఎస్ ధోనీ వంటి దిగ్గజ క్రికెటర్‌ తమ శిబిరంలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. అతడి అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ధోనీ నుంచి యువ క్రికెటర్లు ప్రయోజనం పొందుతారు. అంతర్జాతీయంగా చాలామంది ప్లేయర్లు ఉన్నప్పటికీ.. నా మనస్సులో ధోనీ మాత్రమే ఉన్నాడు’’ అని తెలిపాడు. ఎంఎస్ ధోనీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL 2023) 16వ సీజన్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. 

వారిద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నా..

డేవిడ్‌ వార్నర్‌ (Warner), కేన్ విలియమ్సన్‌ (Kane Williamson) తర్వాత హైదరాబాద్‌ పగ్గాలను దక్కించుకొన్న విదేశీ క్రికెటర్ మార్‌క్రమ్‌. గత రెండు సీజన్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ దారుణమైన ప్రదర్శనతో విఫలమైంది. దీంతో మార్‌క్రమ్‌ నాయకత్వంలో ఉత్తమ ఫలితాలను సాధించాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. మార్‌క్రమ్‌ కూడా తన శాయశక్తులా జట్టును విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ‘‘క్రీడాకారుడిగా విజయం సాధించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. ఇక బాధ్యతలు ఉంటే దానిని ఆస్వాదిస్తూ చేయడం నాకిష్టం. తమ జట్టు బాగా ఆడాలని ప్రతి అభిమాని కోరుకుంటూ ఉంటాడు. వారిని ఆనందంగా ఉంచడానికి శాయశక్తులా కష్టపడతా. జట్టుగా రాణిస్తే తప్పకుండా ఫలితాలు అనుకూలంగా వస్తాయి. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుగా సారథిగా వ్యవహరించిన డుప్లెసిస్‌తోపాటు (Faf du Plessis) కేన్‌ విలియమ్సన్‌ నాయకత్వం నుంచి నేర్చుకుంటా. వీరిద్దరూ నిశ్శబ్దంగా తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు. కేన్, ఫాఫ్‌తో కలిసి ఆడటం నాకు సానుకూలాంశం’’ అని మార్‌క్రమ్‌ తెలిపాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు