కూతురు మురిసింది..వీడ్కోలు ఇంత కష్టమా?

ముంబయి, దిల్లీ, బెంగళూరు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ఇక నేటి ముంబయి×హైదరాబాద్‌ మ్యాచ్‌తో టాప్‌-4లో నిలిచే మరోజట్టు ఎవరనేది తేలనుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌లో చోటు సంపాదించాలని

Updated : 03 Nov 2020 19:51 IST

ఇంటర్నెట్‌డెస్క్: ముంబయి, దిల్లీ, బెంగళూరు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ఇక నేటి ముంబయి×హైదరాబాద్‌ మ్యాచ్‌తో టాప్‌-4లో నిలిచే మరోజట్టు ఎవరనేది తేలనుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌లో చోటు సంపాదించాలని వార్నర్‌సేన భావిస్తుండగా... ముంబయి పైచేయి సాధిస్తుందని, తమకి అవకాశం వస్తుందని కోల్‌కతా ఆశిస్తోంది. మరోవైపు టోర్నీలో వైదొలిగిన జట్ల ఆటగాళ్లు బరువెక్కిన గుండెతో తమ ఇళ్లకు పయనమయ్యారు. వచ్చే సీజన్‌లో కసిగా తిరిగొస్తామని పేర్కొన్నారు. మరి ఆసక్తికర లీగ్‌ కబుర్ల గురించి చూద్దామా!

మైదానంలో ఆటగాళ్ల భద్రతపై  మరింత జాగ్రత్త వహించేలా చర్యలు తీసుకోవాలని ఐసీసీని దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ కోరాడు. ఇటీవల పంజాబ్‌×హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పూరన్‌ త్రో వేయడంతో బంతి విజయ్‌ శంకర్‌ హెల్మెట్‌కు తగిలిన చిత్రాన్ని పోస్ట్‌ చేస్తూ సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ఆటలో పోటీ గొప్పగా పెరుగుతుందని, మరి దానికి తగ్గట్లుగా భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అని ప్రశ్నించాడు. ఇటీవల కొన్ని ప్రమాదకర సంఘటనలు చూశానని, స్పిన్నర్ అయినా, పేసర్‌ అయినా బ్యాట్స్‌మెన్‌ తప్పకుండా హెల్మెట్ ధరించాలని తెలిపాడు. ఈ విషయంలో ఐసీసీ ప్రత్యేక దృష్టిసారించాలని కోరాడు.

నేడు ముంబయితో జరగునున్న మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకోవాలని హైదరాబాద్‌ పట్టుదలతో ఉంది. ‘‘ప్రయత్నిద్దాం, పోరాడుదాం, సాధిద్దాం’’ అని ట్వీట్ చేసింది.

మరోవైపు ముంబయి.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి లీగ్‌ దశను ఘనంగా ముగించాలని భావిస్తోంది. ‘‘ప్లేఆఫ్‌కు ముందు ఇదే చివరి పోరు.. విజయం సాధిద్దాం’’ అని ట్వీటింది.

తమ ఓపెనర్ షేన్‌ వాట్సన్‌కు చెన్నై జట్టు కృతజ్ఞతలు తెలిపింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వాట్సన్‌ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ట్వీట్‌ చేసింది. ‘‘థ్యాంక్యూ వాట్సన్‌. తర్వాతి దశలో కూడా నీకు మంచి జరగాలి. ప్రేమతో వీడ్కోలు’’ అని పేర్కొంది. మరోవైపు లీగ్‌ నుంచి చెన్నై నిష్క్రమించడంతో ఆటగాళ్లు తిరిగి తమ స్వదేశానికి బయలుదేరారు. ధోనీతో కలిసి వస్తున్నానని స్పిన్నర్‌ కర్ణ్‌శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

దిల్లీ చేతిలో ఓటమిపాలైనా మెరుగైన రన్‌రేటుతో బెంగళూరు ప్లేఆఫ్‌కు చేరింది. ‘‘ఎన్నో రకాల భావోద్వేగాలు. కానీ ఓటమితో ప్లేఆఫ్‌లో అడుగుపెడతామని భావించలేదు. ఏది ఏమైనా టాప్‌-4లో ఉన్నాం. భయంలేని క్రికెట్‌ ఆడటానికి అవకాశం లభించింది’’ అని ట్వీటింది.

స్ఫూర్తిదాయక విజయాలతో పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకున్నా.. కీలక మ్యాచ్‌లో తడబడి టోర్నీ నుంచి పంజాబ్ నిష్క్రమించింది. అయితే వచ్చే సీజన్‌లో బలంగా తిరిగొస్తామని ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్ రాహుల్ తెలిపాడు. ‘‘కలిసి గెలిచాం, కలిసి ఓడాం, కలిసి పోరాడాం. అలాగే బలంగా కలిసి తిరిగొస్తాం’’ అని ట్వీటాడు. మరోవైపు నీషమ్‌, మాక్స్‌వెల్‌ ఆత్మీయతో కౌగిలించుకున్న చిత్రాన్ని పంజాబ్‌ పోస్ట్ చేస్తూ.. ‘‘వీడ్కోలు ఇంత కఠినమా?’’ అని ట్వీటింది.

ప్లేఆఫ్‌కు చేరని రాజస్థాన్‌ కూడా ఈ సీజన్‌ గురించి ట్వీట్‌ చేసింది. ‘‘ఇది ఎంతో సవాలైన సీజన్‌. కానీ టోర్నీ ఆద్యంతం ఎంతో ఆస్వాదించాం’’ అని ట్వీటింది.

బెంగళూరును చిత్తు చేస్తూ పట్టికలో దిల్లీ రెండో స్థానానికి చేరుకుంది. రహానె అర్ధశతకంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రహానె కుమార్తె తన తండ్రి ఆటను చూస్తూ ముద్దుగా చప్పట్లు కొడుతున్న వీడియోను దిల్లీ జట్టు పోస్ట్‌ చేసింది. ‘‘మా ముద్దుల అభిమానికి తన తండ్రి ప్రదర్శన ఎంతో నచ్చింది’’ అని ట్వీటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని