IPL 2023: భారత కెప్టెన్ల సారథ్యంలోని జట్లే 12 కప్‌లు నెగ్గాయి: గావస్కర్‌

ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ముగింపు దశకు చేరింది. ప్లేఆఫ్స్‌లో భాగంగా ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. లఖ్‌నవూ - ముంబయి ఇండియన్స్‌ (LSG vs MI) జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరు జట్లకూ మెంటార్‌లుగా గంభీర్, సచిన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ కోచింగ్‌ సిబ్బందిపై క్రికెట్ దిగ్గజం ప్రశంసలు గుప్పించాడు.

Published : 24 May 2023 16:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫైనల్‌కు చేరింది. ఇక రెండో జట్టు తేలాలంటే శుక్రవారం వరకు వేచి చూడాలి. నేడు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ (LSG vs MI) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంటుంది. అప్పుడు ఆ మ్యాచ్‌ విజేత ఫైనల్‌కు వెళ్తుంది. లఖ్‌నవూ జట్టుకు గౌతమ్‌ గంభీర్‌ మెంటార్‌ కాగా.. ముంబయికి సచిన్‌ మెంటార్‌ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో భారతీయ కోచింగ్‌ సిబ్బంది పనితీరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. కుర్రాళ్లను ముందుకు తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని అభినందించాడు. 

‘‘రింకు సింగ్‌ అద్భుతంగా ఆడటంలో కోల్‌కతా కోచ్ చంద్రకాంత్ పండిత్‌ కీలక పాత్ర పోషించాడు. వెంకటేశ్‌ అయ్యర్, వరుణ్‌ చక్రవర్తి నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించారు. కెప్టెన్‌గా నితీశ్‌ రాణా మెరుగుదల వెనుక పండితే కారణం. ఇక గౌతమ్‌ గంభీర్‌ మార్గదర్శకంలో ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్, నవీనుల్‌ హక్‌ ప్లేయర్లు రాటులేదారు. డిఫెండింగ్‌ ఛాంపియన్ ఆశిశ్‌ నెహ్రా - పాండ్య నేతృత్వంలో లీగ్‌ స్టేజ్‌లో గుజరాత్‌ అద్భుత విజయాలను నమోదు చేసింది. విదేశీ కోచ్‌ల వల్ల దేశీయ  ఆటగాళ్లు భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటి వరకు 15  టైటిళ్లలో 12 కప్‌లను భారత క్రికెటర్ల నాయకత్వంలోని జట్లే సొంతం చేసుకున్నాయి’’ అని గావస్కర్‌ తెలిపాడు. ఇందులో రోహిత్ సారథ్యంలో 5 సార్లు, ధోనీ కెప్టెన్సీలో 4 సార్లు, గంభీర్‌ నాయకత్వంలో 2, హార్దిక్‌ ఒకసారి విజేతగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని