Sunil Gavaskar: గతేడాది న్యూజిలాండ్‌ అలవాటుపడినట్లే.. ఇప్పుడు పుజారా..: గావస్కర్‌

టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్‌ పుజారా ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ద్విశతకాలు, రెండు శతకాలు బాదడంపై బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్...

Updated : 13 May 2022 13:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్‌ పుజారా ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో రెండు ద్విశతకాలు, రెండు శతకాలు బాదడంపై బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కౌంటీ క్రికెట్‌ బౌలింగ్‌‌, టెస్టు క్రికెట్ బౌలింగ్‌ ఒకేలా ఉండవని చెప్పాడు. అయితే, టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనలో ఆడే టెస్టు మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు. గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో  ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. కరోనా కేసుల కారణంగా చివరి టెస్టు వాయిదా పడింది. దాన్ని ఇప్పుడు జులై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు.

మరోవైపు పుజారా కొంతకాలంగా టీమ్‌ఇండియా తరఫున విఫలమవడంతో ఇటీవల భారత టీ20 లీగ్‌కు ముందు స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేయలేదు. అయితే, అదే సమయంలో ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో పాల్గొన్న అతడు ససెక్స్‌ టీమ్‌ తరఫున అదరగొట్టాడు. దీంతో అతడు మళ్లీ టీమ్‌ఇండియాకు వచ్చే అవకాశాలపై గావస్కర్‌ స్పందించాడు. ‘ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు పుజారాను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ ఇంగ్లాండ్‌లో రెండు టెస్టులు ఆడటంతో.. ఆ జట్టు అక్కడి పరిస్థితులకు అలవాటు పడింది. దాంతో ఫైనల్‌ మ్యాచ్‌లోనూ వర్షం కురవడంతో పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు పుజారా విషయంలోనూ అదే జరుగుతోంది. ఇంగ్లాండ్‌ పరిస్థితులకు అలవాటు పడ్డాడు. అయితే, కౌంటీ క్రికెట్‌ బౌలింగ్‌ అటాక్‌కు, టెస్టు క్రికెట్‌ బౌలింగ్‌ అటాక్‌కు చాలా తేడా ఉంది. కానీ, ఒక బ్యాట్స్‌మన్‌ మంచి ఫామ్‌లో ఉంటే ఎందుకు ఎంపిక చేయకూడదు?’ అని అభిప్రాయపడ్డాడు.

పుజారా జనవరి వరకూ టీమ్‌ఇండియాలో ఆడాడని, ఇప్పుడు జట్టు నుంచి తొలగించినా ఆ విరామం రెండు మూడేళ్లు ఉండదని గావస్కర్‌ అన్నాడు. కేవలం ఆరు, ఏడు నెలలు మాత్రమే జట్టుకు దూరమవుతాడన్నాడు. దాంతో జులైలో ఇంగ్లాండ్‌తో ఆడే టెస్టు మ్యాచ్‌కు అతడిని ఎంపిక చేయాలన్నాడు. పుజారా బ్యాటింగ్‌ చేసేటప్పుడు తన ఆటతో ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించడం, గోడలా నిలబడి వికెట్‌ కాపాడుకోవడం టీమ్‌ఇండియాకు ముఖ్యమని చెప్పాడు. మరోవైపు ప్రస్తుత కౌంటీ క్రికెట్‌లో అతడి స్ట్రైక్‌రేట్‌ కూడా బాగుందని గావస్కర్‌ మెచ్చుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని