Mumbai Indians: బుమ్రా, సూర్య జట్టును వీడతారని ప్రచారం.. స్పందించిన ముంబయి ఇండియన్స్‌

కెప్టెన్సీ మార్పుతో జట్టులో లుకలుకలు మొదలయ్యాయని.. సీనియర్లు ఫ్రాంచైజీని వీడతారనే రూమర్లు ముంబయి ఇండియన్స్‌ను కలవరానికి గురిచేశాయి. అయితే, వాటిపై జట్టు మేనేజ్‌మెంట్ స్పందించింది. 

Updated : 21 Dec 2023 15:31 IST

ఇంటర్నెట్ డెస్క్: రోహిత్ శర్మను (Rohit Sharma) సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంతో ముంబయి ఇండియన్స్‌పై (Mumbai Indians) అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్‌ పాండ్యను (Hardik Pandya) కెప్టెన్‌ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆ జట్టును అన్‌ఫాలో అవుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. నాయకత్వ మార్పుపై సీనియర్‌ క్రికెటర్లు జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌ కూడా ముంబయి ఇండియన్స్‌ జట్టు బయటకు వచ్చేస్తారనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. పాండ్య నాయకత్వంలో తాము ఆడేది లేదని తేల్చి చెప్పినట్లూ కథనాలు వచ్చాయి. కానీ, అవన్నీ నిరాధారమైనవిగా ముంబయి ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్ కొట్టిపడేసింది. 

‘‘ఇలాంటి ప్రచారం ఎలా మొదలవుతుందో అర్థం కావడం లేదు. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఏ ఆటగాడు ముంబయి ఇండియన్స్‌ను వీడటంలేదు. మేం మరెవరినీ కొనుగోలు చేయడం లేదు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్‌ శర్మకు తెలుసు. ఈ నిర్ణయంలో అతడూ భాగస్వామే’’ అని ముంబయి ఇండియన్స్‌ స్పష్టం చేసింది. రెండు రోజుల కిందట మినీ వేలం సందర్భంగా దుబాయ్‌లో ముంబయి సహ యజమాని ఆకాశ్‌ అంబానీ కూడా ‘‘రోహిత్ విషయంలో ఆందోళన వద్దు. అతడు బ్యాటింగ్‌ చేస్తాడు’’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

నాయకత్వ బాధ్యతలపై ప్రతి ఒక్కరితో చర్చించాం: బౌచర్

‘‘జట్టులోని ప్రతి ఆటగాడు, మేనేజ్‌మెంట్‌లోని సభ్యులతో కెప్టెన్సీ విషయంపై చర్చించాం. ముంబయి ఇండియన్స్‌ టీమ్‌లో మార్పులకు ఇది సమయం. క్రికెట్‌లో ఇలాంటివి సర్వసాధారణం. భవిష్యత్తు కోసం ముంబయి ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్ ఆలోచించింది. రోహిత్‌ నాయకత్వంలో అద్భుతమైన ఘనతలను సాధించాం. జట్టులో అతడు వీరుడులాంటి వాడు. జట్టు భవిష్యత్తు కోసం ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, అభిమానుల భావోద్వేగాలను అర్థం చేసుకోగలం. ఇక ఆటగాళ్లు జట్టును వీడుతున్నారనేది నేను సోషల్ మీడియాలో మాత్రమే చూస్తున్నా. వాటిపై నేను ఎక్కువగా స్పందించను. ప్లేయర్లు, కెప్టెన్సీ విషయంలో మేం అత్యుత్తమంగానే వ్యవహరించామని భావిస్తున్నా’’ అని ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని