
T20 World Cup: హార్దిక్ బౌలింగ్ చేయక పోయినా నష్టం లేదు.. భువి స్థానంలో ఠాకూర్ అయితే బెటర్
(Photo: Hardik Pandya Twitter)
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను దాయాది దేశం పాకిస్థాన్‌తో అక్టోబర్ 24న ఆడనుంది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై విశ్లేషిస్తున్న మాజీ క్రీడాకారులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ తమ అభిప్రాయాలను చెప్పారు. హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయకపోవడం టీమ్‌ఇండియా అవకాశాలను ప్రభావితం చేయదని కపిల్‌దేవ్ అన్నారు. కానీ, ఇది కీలకమైన మ్యాచ్‌ల్లో జట్టు కూర్పును, ఆటగాళ్ల ఎంపికను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. పొట్టి ప్రపంచకప్‌లో హార్దిక్ రెండు ఓవర్లు బౌలింగ్ చేస్తే టీమ్‌ఇండియాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. ఒకవేళ హార్దిక్ బౌలింగ్ చేయకపోతే ఆల్‌రౌండర్లను తయారు చేయడానికి అవసరమైన వనరులు భారత్ వద్ద ఉన్నాయన్నారు.
‘ఆల్‌రౌండర్ అనేవాడు జట్టుకు చాలా కీలకంగా ఉంటాడు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ బౌలింగ్ చేయకపోవడం టీమ్‌ఇండియా అవకాశాలను ప్రభావితం చేయదు. కానీ, జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై ప్రభావం చూపుతుంది. బౌలర్లను మార్చడానికి, అదనపు బౌలర్‌గా వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. హార్దిక్ కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేసినా జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. హార్దిక్ పాండ్య బౌలింగ్ లోటును తీర్చడానికి అవసరమైన వనరులు భారత్ వద్ద ఉన్నాయని నమ్ముతున్నా. హార్దిక్ పాండ్య నెట్స్‌లో బౌలింగ్ చేయడం చాలా ముఖ్యం. 40- 50 బంతులను నెట్స్‌లో విసరగలిగితే అది ఏ ఆటగాడికైనా మ్యాచ్‌లో బౌలింగ్ చేయగలననే నమ్మకాన్ని ఇస్తుంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేయకపోతే మీ బౌలింగ్‌పై మీకు నమ్మకం పోతుంది. ఎలాంటి గాయమైనా ఆటగాడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది’ అని కపిల్‌దేవ్ అన్నారు.
భువి స్థానంలో శార్దూల్‌కి అవకాశం: అగార్కర్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 24న పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి అవకాశమివ్వాలని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ సూచించాడు. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లో లేడని, ఆల్-రౌండర్‌గా జట్టులోకి తీసుకున్న హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా లేడు. కాబట్టి, భువనేశ్వర్‌ను పక్కన పెట్టి శార్దూల్ ఠాకూర్‌కి ఒక అవకాశమిచ్చి చూడాలని అగార్కర్ పేర్కొన్నాడు.
‘సాధారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. ఒక వేళ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తే.. ఐదుగురితో బరిలోకి దిగొచ్చు. కానీ, ఫ్లాట్ పిచ్‌పై కచ్చితంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు సహా ఆరుగురు బౌలర్లతో ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. భువనేశ్వర్ కుమార్‌ని పక్కన పెట్టి.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్‌లతో బరిలోకి దిగొచ్చు’ అని అగార్కర్ సూచించాడు. సోమవారం ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (51), ఇషాన్ కిషన్ (70) అర్ధ శతకాలతో రాణించారు. బుధవారం మరో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది.