INDvsENG: ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల నోటి దురుసు.. టీమ్‌ఇండియా విజయ పరంపర

టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఏ క్రికెట్‌ మ్యాచ్‌ అయినా రసవత్తరంగా ఉంటుంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన ఆటగాళ్లుంటారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు...

Published : 22 Aug 2021 10:21 IST

టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఏ క్రికెట్‌ మ్యాచ్‌ అయినా రసవత్తరంగా ఉంటుంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన ఆటగాళ్లుంటారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. ఈ క్రమంలోనే పలుమార్లు క్రికెటర్లమనే సంగతి మరిచిపోయి నోటికి పనిచెప్తారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ ప్లేయర్లు ఇష్టమొచ్చినట్లు దూషిస్తారు. అవి ఒక పరిమితి వరకైతే ఫర్వాలేదు కానీ.. శ్రుతి మించితే టీమ్‌ఇండియా నుంచి దీటైన సమాధానం ఉంటుంది. తాజాగా జరిగిన రెండో టెస్టులోనూ ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. దాంతో గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన కొన్ని వివాదాస్పద సంగతులు గుర్తుచేసుకుందాం.

ఫ్లింటాఫ్‌ రెచ్చగొట్టి.. యువీ మెరుపులు

2007 టీ20 ప్రపంచకప్‌ దాదాపు అందరికీ గుర్తుండి ఉంటుంది. సెమీస్‌కు ముందు ఇంగ్లాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ రెచ్చిపోయాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు సంధించి భారత క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌కు పీడకల మిగిల్చాడు. అయితే, యువీ అలా రెచ్చిపోవడానికి కూడా ఓ కారణం ఉందనే సంగతి కొందరికి తెలిసే ఉంటుంది. మాజీ ప్లేయర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ అంతకుముందు ఓవర్లో యువరాజ్‌ను పీక కోస్తా అనే మాటలు అన్నాడు. దాంతో రెచ్చిపోయిన భారత బ్యాట్స్‌మన్‌ తర్వాతి ఓవర్‌లో బ్రాడ్‌ను చితకబాదాడు. అప్పుడు ఫ్లింటాఫ్‌ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే ఆ రికార్డు నమోదయ్యేది కాదేమో!

ఆండర్సన్ బూతులు.. జడేజాకు కోతలు‌

ఇక 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇంగ్లాండ్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌.. టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను బూతులు తిట్టాడు. తొలి టెస్టు రెండో రోజు భోజన విరామ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లేటప్పుడు జడ్డూను వెనక్కిలాగిన ఇంగ్లిష్‌ పేసర్‌.. పరుష పదాలు ఉపయోగించి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లిపో అంటూ బెదిరించాడు. భోజన విరామం అనంతరం కూడా అండర్సన్‌ తనని దూషించాడని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. ఈ సంఘటనపై ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నాయి. చివరికి ఐసీసీ కలగజేసుకొని విచారణ జరిపి సరైన సాక్ష్యాలు లేవని జడ్డూకే మ్యాచ్‌ ఫీజ్‌లో 50 శాతం కోత విధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో అంపైర్‌ ఆక్సెన్‌ఫర్డ్‌ సైతం పలుమార్లు అండర్సన్‌ బూతు మాటలు పలకడం విన్నానని చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

స్టోక్స్‌ మాటలు.. కోహ్లీ తూటాలు

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా బెన్‌స్టోక్స్‌ టీమ్‌ఇండియా ఆటగాళ్లపై నోరుపారేసుకున్నాడు. నాలుగో టెస్టు తొలి రోజు స్టోక్స్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా మహ్మద్‌ సిరాజ్‌ వేసిన ఓ బంతి బౌన్సర్‌గా వెళ్లింది. దాంతో కోపోద్రిక్తుడైన అతడు సిరాజ్‌ను ఏవో మాటలన్నాడు. అయినా, సిరాజ్‌ తిరిగి స్పందించకుండా బౌలింగ్‌ చేశాడు. అదే సమయంలో కెప్టెన్‌ కోహ్లీ కలగజేసుకొని స్టోక్స్‌తో మాట్లాడటానికి ప్రయత్నించాడు. దాంతో మరింత రెచ్చిపోయిన ఇంగ్లిష్‌ ఆల్‌రౌండర్‌ మరిన్ని మాటలన్నాడు. కోహ్లీ సైతం అంతే దీటుగా మాటలతూటాలు పేల్చాడు. అయితే, అంపైర్లు కలగజేసుకొని ఇద్దరినీ సముదాయించడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించడమే కాకుండా 3-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.

బట్లర్‌ నోరుజారి.. కోహ్లీకి కోపమొచ్చి

అదే పర్యటనలో ఇరు జట్ల మధ్య జరిగిన ఐదో టీ20లోనూ మరో ఇంగ్లాండ్‌ బ్యాట్సమన్‌ జోస్‌ బట్లర్‌.. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో మాటల యుద్ధానికి దిగాడు. తొలుత అతడు ఏవో మాటలన్నా కోహ్లీ పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ విజయం వైపు పరుగెడుతున్న సమయంలో భువి వేసిన 13వ ఓవర్‌లో బట్లర్‌(52) ఔటయ్యాడు. దాంతో మ్యాచ్‌ భారత్‌వైపు మళ్లింది. అదే సమయంలో బట్లర్‌ ఏదో అనుకుంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌ బాటపట్టాడు. దాంతో కోహ్లీ సైతం కోపంలో దీటుగా స్పందించాడు. ఈ క్రమంలోనే బట్లర్‌ తిరిగి పిచ్‌వైపు రావడానికి చూడగా కోహ్లీ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించి పొట్టి కప్పును కూడా ఎగరేసుకుపోయింది.

అండర్సన్‌తో మొదలై.. భారత్‌ గెలిచేదాకా

ఇక తాజాగా లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులోనూ ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు బుమ్రా పలుమార్లు షార్ట్‌పిచ్‌ బంతులు వేశాడు. దాంతో ఇబ్బంది పడిన అతడు ఇలా బంతులెందుకు వేస్తున్నావని అడిగాడు. అనంతరం ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక బుమ్రా వెళ్లి అతడికి క్షమాపణలు చెప్పాలని చూసినా బూతులు తిడుతూ అవమానించాడని తెలిసింది. అంతకుముందు రోజు కూడా టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో అండర్సన్‌, కోహ్లీల మధ్య మాటలు పేలాయి. ఇంగ్లిష్‌ పేసర్‌ పిచ్‌ మధ్యలో పరుగెత్తడం గమనించిన కోహ్లీ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. దాంతో అండర్సన్‌ ఏవో మాటలన్నాడు. కోహ్లీ సైతం అదే స్థాయిలో జవాబిచ్చాడు. ఇక చివరి రోజు కూడా బుమ్రా బ్యాటింగ్‌ చేసేటప్పుడు మార్క్‌వుడ్‌ దూషించాడు. ఆ విషయంపై బుమ్రా అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో బట్లర్‌ కలగజేసుకొని బుమ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరికి ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ ఘన విజయం సాధించింది.

- ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని