Tokyo olympics: 4తో సంతోషించలేను.. చాలా బాధేస్తోందన్న అదితి

ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం తట్టుకోలేక పోతున్నానని భారత యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌ తెలిపింది. పతకం గెలిస్తే బాగుండేదని పేర్కొంది. మరేదైనా టోర్నీలో నాలుగో స్థానం వస్తే సంతృప్తి చెందేదాన్నని వెల్లడించింది...

Published : 07 Aug 2021 12:31 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం తట్టుకోలేకపోతున్నానని భారత యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌ తెలిపింది. పతకం గెలిస్తే బాగుండేదని పేర్కొంది. మరేదైనా టోర్నీలో నాలుగో స్థానం వస్తే సంతృప్తి చెందేదాన్నని వెల్లడించింది.

భారత్‌ తరఫున ఎవరూ చేయలేని అద్భుతాన్ని అదితి చేసింది. తృటిలో పతకం చేజార్చుకుంది. నాలుగో రౌండ్‌లో ఆఖరి రెండు హోల్స్‌ ఆడేంత వరకు ఆమెకు పతకం ఖాయమనే అనిపించింది. మొత్తంగా 15 అండర్‌ 269తో నాలుగో స్థానానికి పరిమితమైంది.

‘ఇలాంటి ప్రదర్శన మరేదైనా టోర్నీలో చేసుంటే నేను నిజంగా ఆనందించేదాన్ని. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం అంటే భరించడం కష్టం. నేను బాగా ఆడాను. 100శాతం శ్రమించాను’ అని అదితి తెలిపింది. నాలుగో రౌండ్లో రెండు బోగీస్‌తో పోలిస్తే ఆమెకు ఐదు బర్డీలు వచ్చాయి. అయినప్పటికీ ఆమె సంతృప్తిగా లేదు!

‘తృటిలో చేజార్చుకున్నా. ముందరి తొమ్మిది హోల్స్‌ను బాగా ఆడాను. వెనక తొమ్మిది హోల్స్‌లో నాలుగైదు మరింత బాగా ఆడుంటే బాగుండేది. ఏదేమైనా ఇదో చెడ్డ రోజు. పతక రేసులో లేకుండా చేసింది. పోడియం ఎక్కలేక పోయాను’ అని అదితి పేర్కొంది. 

‘నా మెడలో పతకం పడిందనే అనుకున్నా. ఏదేమైనా దేశ పౌరులు సంతోషిస్తారనే అనుకుంటున్నా. నాలుగో రౌండ్‌ ఆడే ముందు అభిమానుల అంచనాల గురించి అతిగా పట్టించుకోలేదు. పతకాలే సాధించకపోయినా అగ్రస్థానాల్లో నిలుస్తుంటే ఈ ఆటకు మరింత మద్దతు లభిస్తుంది. చిన్నారులు గోల్ఫ్‌ను ఎంచుకోగలరు. దాంతో ఆట అభివృద్ధి చెందుతుంది’ అని అదితి తెలిపింది.

వందేళ్ల విరామం తర్వాత 2016 ఒలింపిక్స్‌లో గోల్ఫ్‌ను చేర్చారు. రియో ఒలింపిక్స్‌లో అదితి ఉమ్మడిగా 41వ స్థానంలో నిలిచింది. ‘నేను గోల్ఫ్‌ ఆడటం ఆరంభించినప్పుడు ఒలింపిక్స్‌లో పోటీ పడతానని అస్సలు అనుకోలేదు. అప్పుడది ఒలింపిక్‌ క్రీడ కాదు. ఆటను ఎంచుకొని ప్రతి రోజూ ఆస్వాదిస్తూ సాధన చేస్తే ఏదో ఒక రోజు పతకాలు సాధించొచ్చు’ అని ఆమె వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని