India vs Srilanka: షాక్‌..! కృనాల్‌ పాండ్యకు కరోనా.. నేటి టీ20 వాయిదా

శ్రీలంక, భారత్‌ రెండో టీ20 వాయిదా వేస్తున్నట్టు తెలిసింది. భారత ఆటగాళ్లలో ఒకరికి కరోనా వైరస్‌ సోకడమే కారణం. యువ క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యకు పాజిటివ్‌ వచ్చినట్టు సమాచారం...

Updated : 27 Jul 2021 16:37 IST

కొలంబో: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టుకు షాక్‌! యువ ఆటగాడు కృనాల్‌ పాండ్యకు కరోనా వైరస్‌ సోకింది. ఫలితంగా నేడు జరగాల్సిన భారత్‌, శ్రీలంక రెండో టీ20 వాయిదా పడింది. ప్రస్తుతం ఆటగాళ్లంతా బయో బుడగలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అతడికి పాజిటివ్‌ ఎలా వచ్చిందో స్పష్టత లేదు.

తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా రెండో మ్యాచు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావించింది. నేడు (మంగళవారం) జరిగే పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మ్యాచు మొదలవుతుందనగా.. కృనాల్‌కు వైరస్‌ సోకిన విషయం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. దాంతో నేటి మ్యాచును బుధవారానికి, గురువారం జరగాల్సిన పోరును శుక్రవారానికి వాయిదా వేస్తారని సమాచారం. లేదా బుధ, గురువారాల్లో రెండు మ్యాచులు ఆడేసి నిర్దేశిత సమయంలోనే సిరీసు ముగిస్తారని మరికొందరు అంటున్నారు.

‘అవును, కృనాల్‌కు పాజిటివ్‌ వచ్చింది. నేటి టీ20 మ్యాచ్‌ వాయిదా పడింది. భారత బృందంలోని మిగతా ఆటగాళ్ల ఆర్‌టీ పీసీఆర్‌ ఫలితాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం 6 గంటలకు అవి అందుతాయి. ఇంకెవరికీ వైరస్‌ సోకని పక్షంలో బుధవారం మ్యాచ్‌ ఉండొచ్చు’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

కృనాల్‌కు పాజిటివ్‌ రావడం ఇంగ్లాండ్‌కు వెళ్లాల్సిన సూర్యకుమార్‌ యాదవ్‌, పృథ్వీ షా పైనా ప్రభావం పడనుంది. బుడగ నుంచి బుడగకు బదిలీ జరిగితే క్వారంటైన్‌ అవసరం లేదు. నేరుగా కోహ్లీసేనతో కలవచ్చు. మరిప్పుడు బుడగలోనే వైరస్‌ రావడంతో సూర్య, షా పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. ఇంగ్లాండ్‌లో ఇప్పటికే రిషభ్‌ పంత్‌ కరోనా బారిన పడి కోలుకున్నాడు. అతడితో సన్నిహితంగా మెలిగిన వృద్ధిమాన్‌ సాహా, భరత్‌ అరుణ్‌, అభిమన్యు ఈశ్వరన్‌ పది రోజులు ఐసోలేషన్‌లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని