Published : 20 Nov 2021 01:16 IST

Team India: రచిన్‌ అనే పేరు రాహుల్‌‌, సచిన్‌ నుంచే వచ్చిందా?

ఆ విషయం నాకూ తెలియదు: న్యూజిలాండ్‌ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర

(Photo: Black caps Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దిగ్గజ ఆటగాడని, అతడి నుంచి పలు విషయాలు నేర్చుకుంటానని న్యూజిలాండ్‌ యువ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర అన్నాడు. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు మీడియాతో వర్చువల్‌గా మాట్లాడిన అతడు తన పేరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ తెందూల్కర్ పేర్ల నుంచే తన పేరు పెట్టారా? అని అడిగిన ప్రశ్నకు.. ఆ విషయం తనకూ తెలియదని బదులిచ్చాడు. తన తల్లిదండ్రులను దీని గురించి ఎప్పుడూ అడగలేదని చెప్పాడు. ఈ విషయంపై స్పష్టత కావాలంటే వారినే అడగాలని సూచించాడు. రచిన్‌ 2016, 2018లో అండర్‌-19 స్థాయిలో న్యూజిలాండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే అప్పట్లో టీమ్‌ఇండియా అండర్‌-19, ఇండియా ఏ జట్లతోనూ మ్యాచ్‌లు ఆడాడు. అదే సమయంలో యువ ఆటగాళ్లకు కోచ్‌గా సేవలందించిన ద్రవిడ్‌తో పరిచయం ఏర్పడింది. ఇక ఈ ఏడాది బంగ్లాదేశ్‌ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రచిన్‌ తాజాగా భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ ఆడుతున్నాడు. దీంతో మరోసారి రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి మరిన్ని మెళకువలు నేర్చుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘ద్రవిడ్‌ సర్‌ గొప్ప లెజెండరీ ఆటగాడు. ఆయన అండర్‌-19, ఇండియా ఏ జట్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో కివీస్‌ పర్యటనకు వచ్చారు. అప్పుడు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆటలో పలు విషయాలు కూడా నేర్చుకున్నాను. ఇక ఈ సిరీస్‌లో ఆడుతున్నందున ద్రవిడ్‌తో మరోసారి కలిసే అవకాశం దక్కింది. దీంతో ఆయ నుంచి మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ద్రవిడ్‌తో కలిసి ప్రయాణిస్తే నా కెరీర్‌కు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా’ అని రచిన్‌ చెప్పుకొచ్చాడు. అనంతరం టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై మాట్లాడుతూ.. అతడో ప్రపంచ స్థాయి స్పిన్నర్‌ అని కొనియాడాడు. అశ్విన్‌ చాలా కాలంగా రాణిస్తున్నాడని, దీంతో అతడికి మంచి రికార్డు ఉందని యువ క్రికెటర్‌ గుర్తుచేశాడు. ఇప్పటివరకూ అశ్విన్‌తో కలిసే అవకాశం రాలేదని, కానీ.. అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా అతడి నుంచి కూడా కొత్త విషయాలు నేర్చుకుంటానని ఈ యువ స్పిన్నర్‌ అన్నాడు. కాగా, రచిన్‌ తల్లిదండ్రులది బెంగళూరు. తండ్రి పేరు రవి కృష్ణమూర్తి, తల్లి దీపా కృష్ణమూర్తి. 1990ల్లోనే వీరు న్యూజిలాండ్‌కెళ్లి స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే రచిన్‌ రవీంద్ర అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు. చివరికి క్రికెటర్‌గా ఎదిగి ఇప్పుడు న్యూజిలాండ్‌ జట్టులో ఆడుతున్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని