Updated : 05 Nov 2021 12:45 IST

Virat Kohli: కొంచెం తీపి... ఎక్కువ చేదు.. ఇదీ విరాట్‌ ఇయర్‌ రివ్యూ

కీలక సమరాల్లో చేతులెత్తేస్తున్న నాయకుడు

ఆధునిక క్రికెట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌.. నిలకడకు మరోపేరు.. కొండంత లక్ష్యాన్నైనా సునాయసంగా కరిగించే ఛేదన రారాజు... ఫీల్డింగ్‌లో చిరుత.. ఫిట్‌నెస్‌లో మేటి. ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ గురించి చెప్పమంటే ఎవరన్నా ఈ మాటలే చెబుతారు. గతేడాది కాలంలో విరాట్‌ ఇలానే ఉన్నాడు. అయితే కెప్టెన్‌గా మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఈరోజు అతడి పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్‌డే చెబుతూ... ఈ ఏడాది అతడి ప్రదర్శన ఎలా సాగిందో రివైండ్‌ చేసుకుందాం.

ఆటగాడిగా అదుర్స్‌..

ఆటగాడిగా కోహ్లీ రికార్డుల గురించి అందరికీ తెలుసు. 2016 సీజన్లో అతడి పరుగుల వరద, శతకాల జోరును ఎవ్వరూ మర్చిపోలేరు. ఐపీఎల్‌లో మొత్తం 207 మ్యాచులాడిన అతడు 37.39 సగటు, 129.94 స్ట్రైక్‌రేట్‌తో 6,283 పరుగులు చేశాడు. 5 శతకాలు, 42 అర్ధశతకాలూ సాధించాడు. ఎన్నో రికార్డులు సృష్టించాడు. 2021లో 15 మ్యాచులు ఆడి 405 పరుగులు చేశాడు. నిజానికి ఐపీఎల్‌లో పరుగుల పరంగా కోహ్లీని మించిన ఆటగాడు మరొకరు లేనేలేరు. ఎన్నో రికార్డులు అతడి పేరిట లిఖించుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో 443 మ్యాచుల్లో 55కి పైగా సగటు, సుమారు 80 స్ట్రైక్‌రేట్‌తో 23,159 పరుగులు చేశాడు. 70 శతకాలు, 118 అర్ధశతకాలు, 2,301 బౌండరీలు, 238 సిక్సర్లు బాదేశాడు.

ప్చ్‌.. కప్పు లేకుండానే...

ఐపీఎల్‌లో ఏటా ‘ఈ సాలా కప్‌ నమదే’ అని వచ్చే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈసారి అలాంటి హడావిడి లేకుండానే అడుగుపెట్టింది. లీగు మ్యాచ్‌ల్లో బాగా ఆడి ప్లేఆఫ్స్‌ బెర్తును కాస్త ముందుగానే ఖరారు చేసుకొని అభిమానులకు కొంచెం సంతోషం కలిగించింది. అయితే, కోహ్లీ అంతకుముందే ఆర్సీబీ కెప్టెన్‌గా ఇదే తన చివరి టోర్నీ అని ప్రకటించి షాకిచ్చాడు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు బాగా ఆడి ప్లేఆఫ్స్‌ చేరడంతో ఈసారైనా కప్పు సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ మరోసారి ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. ఎలిమినేటర్‌లో కోల్‌కతా చేతిలో ఓటమిపాలైన కోహ్లీసేనను చూసి అటు బెంగళూరు, ఇటు విరాట్‌ అభిమానులు ఎంత బాధపడ్డారో చెప్పడం కష్టం. గొప్ప ఆటగాళ్లుండి 14 సీజన్లలో ఒక్కసారీ ఆ జట్టు ట్రోఫీ అందుకోలేదు. చివరికి టైటిల్‌ సాధించకుండానే కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీకి దూరమయ్యాడు.

ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి విరాట్‌ బెంగళూరుకే ఆడుతున్నాడు. యువకుడిగా మొదలైన అతడి ప్రస్థానం సారథిగా మలుపు తిరిగింది. 2013లో జట్టు బాధ్యతలు తీసుకొని భారీ అంచనాల నడుమ ఏటా బరిలోకి అడుగుపెట్టాడు. కానీ విఫలమయ్యాడు. ఎప్పుడూ జట్టులో ఏదో ఒక లోపం ఉండనే ఉంటోంది. తొలుత బ్యాటింగ్‌ విభాగానికి మాత్రమే ప్రాధాన్యం ఉండేది. బౌలింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసుకోలేదు. ఇప్పటికీ ఆ జట్టులో మంచి విదేశీ పేసర్‌ కనిపించడం లేదు. ఇదివరకు క్రిస్‌గేల్‌, ఏబీ డివిలియర్స్‌, కేఎల్‌ రాహుల్‌ వంటి భీకరమైన బ్యాట్స్‌మన్‌ ఉన్నా గెలుపు బాట పట్టింది లేదు. ఈసారి గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మెరుపులు మెరిపించినా ఫైనల్‌ చేరలేకపోయింది. కోహ్లీ సారథ్యంలో ఎనిమిదేళ్లలో ఒక్కసారే ఫైనల్‌ చేరినా సాధించిందేమీ లేదు. 

ఎప్పుడూ నాకౌట్లలో.. ఈసారి లీగుల్లో

బ్యాట్స్‌మన్‌గా తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లీ నాయకుడిగా కీలక సందర్భాల్లో విఫలమవుతున్నాడు. ద్వైపాక్షిక సిరీసులు గెలవడం, లీగు మ్యాచుల్లో విజయ దుందుభి మోగించడం పక్కనపెడితే ఐపీఎల్‌ ఫ్లేఆఫ్స్‌, ఐసీసీ నాకౌట్స్‌లో అభిమానులకు గుండెకోత మిగల్చడం తెలిసిందే. ఆయా టోర్నీల్లో సాంతం అదరగొట్టి నాకౌట్‌ లాంటి కీలక మ్యాచుల్లో చేతులెత్తేసే విరాట్‌.. ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనే విఫలమయ్యాడు. అతడి సారథ్యంలో టీమ్‌ఇండియా ఈ ఏడాది ఇంటా, బయటా ఇంగ్లాండ్‌పై సిరీస్‌ విజయాలు సాధించడం, అంతకుముందు ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు సిరీస్‌ కైవసం చేసుకోవడం కూడా మనమంతా చూశాం. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ ఓటమిపాలై మరోసారి తడబడ్డాడు. తాజాగా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్లతో చిత్తుగా ఓడి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే, కొన్నిసార్లు వ్యూహాలు, మార్పులతో ఇబ్బందులు పడుతున్న విరాట్‌.. మరికొన్ని సార్లు ఆటగాళ్ల వైఫల్యంతో చతికిల పడుతున్నాడు.

పొట్టి కప్పు అందుకోలేడా?

టీ20 ప్రపంచకప్‌లోనూ టీమ్‌ఇండియా సెమీస్‌ చేరడమే ఇప్పుడు ఇతర జట్ల ఆటతీరుపై ఆధారపడింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా... వేరే జట్ల మ్యాచ్‌ల ఫలితాలవైపు చూడాల్సిన పరిస్థితి. అలాంటిది కప్పు సాధించడం అంటే అత్యాశే అవుతుంది. కానీ.. అదృష్టం కలిసొచ్చి.. తర్వాతి మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా చెలరేగి.. న్యూజిలాండ్‌, అఫ్గాన్‌ జట్ల రన్‌రేట్‌ కన్నా మెరుగైతే సెమీస్‌ చేరే అవకాశం ఉంది. ఇదీ గతేడాదిగా విరాట్‌ కోహ్లీ బ్యాట్స్‌మన్‌ అండ్‌ కెప్టెన్‌ గ్రాఫ్‌. ఈ ప్రపంచకప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీని వదులుకుంటున్న విషయం తెలిసిందే. కాబట్టి కెప్టెన్‌గా దిగుతూ దిగుతూ... విరాట్ జట్టుకు కప్‌ తెచ్చిపెట్టాలని ఆశిద్దాం. ఆల్‌ ది బెస్ట్‌ విరాట్‌.. వన్స్‌ అగైన్‌ హ్యాపీ బర్త్‌డే.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని