WI vs IND : జట్టుకింకా అతడి అవసరం ఉంది.. అలా తొలగించాల్సింది కాదు : హర్భజన్‌

టెస్టు జట్టు నుంచి సీనియర్‌ ఆటగాడు పుజారా (Cheteshwar Pujara)ను తొలగించిన విధానంపై హర్భజన్‌ సింగ్‌(Harbhajan Singh) అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టుకు ఇంకా అతడి అవసరం ఉందని పేర్కొన్నాడు.

Updated : 12 Jul 2023 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా(Team India) వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌(WI vs IND)కు సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే WTC Finalలో ఘోర ఓటమి చెందడంతో.. రోహిత్‌ సేనకు తిరిగి పుంజుకునేందుకు ఇదొక మంచి అవకాశం. ఇక WTC Finalలో తీవ్రంగా నిరాశపరిచిన సీనియర్‌ బ్యాటర్‌ పుజారా(Cheteshwar Pujara)ను తప్పంచి.. ఈ టెస్టు సిరీస్‌లో యువకులకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. కేవలం ఏడాది వ్యవధిలోనే టెస్టు జట్టు నుంచి స్థానం కోల్పోవడం పుజారాకు ఇది రెండో సారి. అతడిని తప్పించడంపై మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌(Harbhajan Singh) అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘‘నాకు పుజారా సాధించిన దానిపై ఎంతో గౌరవం ఉంది. అతడు చాలా ఏళ్లుగా భారత జట్టుకు గొప్ప సేవలు అందించినా.. తగినంత పేరు రాలేదు. టీమ్‌ఇండియాను బలోపేతం చేసిన మూలస్థంభాల్లో అతడొకరు. ఇతర బ్యాటర్లు సౌకర్యవంతంగా ఆడేందుకు అతడు ఎంతో కష్టపడ్డాడు’’ అని భజ్జీ వివరించాడు.

ఇక అతడిని టీమ్‌ నుంచి తొలగించిన విధానంపై హర్భజన్‌ మండిపడ్డాడు. ‘పుజారాకు మరింత గౌరవం ఇవ్వాల్సి ఉండేదని నేను భావిస్తున్నా. అతడిని టీమ్‌ నుంచి తొలగించిన విధానం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. పరుగులు చేయలేని బ్యాటర్లలో అతడొక్కడే లేడు. ఇదే జట్టులో అదే యావరేజ్‌తో ఇతర ఆటగాళ్లూ ఉన్నారు’’ అని భజ్జీ పేర్కొన్నాడు.

ఇక టెస్టుల్లో పుజారా స్ట్రైక్‌ రేట్ గురించి అందరూ మాట్లాడుతుంటారని.. అలాంటి స్ట్రైక్‌ రేట్‌ కారణంగానే వికెట్లు పడకుండా ఉంటాయని.. ఇది జట్టుకు పెద్ద సహకారమని హర్భజన్‌ వివరించాడు. ‘ఎవరు జట్టుకు ఎలా సహకారం అందిస్తున్నారో చూడాలి. నా అభిప్రాయం ప్రకారం జట్టుకు అతడి అవసరం ఇంకా ఉంది. మీరు SENA దేశాలకు వెళ్లినప్పుడు.. అలాంటి బ్యాటర్‌ ఒకరు అవసరం’ అంటూ పుజారా విలువ గురించి భజ్జీ చెప్పాడు.

ఇక విండీస్‌(WI vs IND)తో ఈ నెల 12 నుంచి భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌  ఆడనుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని