రీప్లే వేశాక కోహ్లీ సమీక్ష: అంపైర్ల తిరస్కరణ

భారత్‌, ఆస్ట్రేలియా మూడో టీ20లో ఒక విచిత్రం జరిగింది! బహుశా అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కావొచ్చు. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కోరిన సమీక్షను అంపైర్లు తిరస్కరించారు. టీవీ తెరపై రిప్లే వచ్చాక కోరాడని బ్యాట్స్‌మన్‌ ఫిర్యాదు...

Updated : 08 Dec 2020 16:53 IST

మూడో టీ20: 20 సెకన్ల నిడివిలో నాటకీయ పరిణామాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌:  భారత్‌, ఆస్ట్రేలియా మూడో టీ20లో ఒక విచిత్రం జరిగింది! బహుశా అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కావొచ్చు. టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కోరిన సమీక్షను అంపైర్లు తిరస్కరించారు. టీవీ తెరపై రీప్లే వచ్చాక కోరాడని బ్యాట్స్‌మన్‌ ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 11 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను యువ పేసర్‌ నటరాజన్‌ విసిరాడు. నాలుగో బంతిని మాథ్యూవేడ్‌ ఆడాడు. లెగ్‌స్టంప్‌ మీదుగా వచ్చి హాఫ్‌ వాలీని వేడ్ ఆడలేకపోయాడు. దాంతో బంతి నేరుగా ప్యాడ్లకు తగిలింది. బంతి విసిరిన నట్టూ అప్పీల్‌ చేయలేదు. కీపర్‌ రాహుల్‌ సమీక్షను పట్టించుకోలేదు. డీప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లీ సమీక్ష కోరాడు. అంపైర్లు అంగీకరించి థర్డ్‌ అంపైర్‌కు నివేదించగా ఆయన అంగీకరించలేదు. దాంతో గందరగోళానికి గురైన విరాట్‌ పరుగెత్తుకుంటూ మైదానంలోని ఫీల్డర్ల వద్దకు వచ్చాడు.

ఇంతకీ ఏమైందంటే.. విరాట్‌ సమీక్ష కోరేలోపే మైదానంలోని భారీ తెరపై ఆ బంతికి సంబంధించిన రీప్లేను ప్రదర్శించారు. అందులో బంతి వికెట్లను తగులుతున్నట్టు తేలింది. దాంతో తెరపై వచ్చాక సమీక్ష కోరారని మాథ్యూవేడ్‌ ఫిర్యాదు చేయడంతో రివ్యూను అంపైర్లు తిరస్కరించారు. అయితే విరాట్‌ నిర్దేశిత సమయంలోనే సమీక్ష కోరాడా? రీప్లే ముందుగానే ప్రదర్శించారా? అనే విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం దీనిపై సోషల్‌ మీడియాలో ప్రశ్నలు తలెత్తున్నాయి. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జిమ్మీ నీషమ్‌, వ్యాఖ్యాత హర్షభోగ్లే, మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడారు. ‘లెగ్‌స్టంప్‌ హాఫ్‌వాలీని బ్యాటర్‌ ఆడలేదు. బౌలర్‌ అప్పీల్‌ చేయలేదు. కీపర్‌ సమీక్షను పట్టించుకోలేదు. భారీ తెరపై రిప్లేను త్వరగా ప్రదర్శించారు. బ్యాటర్‌ ఫిర్యాదు చేసేంత వరకు అంపైర్‌ సమీక్షను అంగీకరించాడు. 20 సెకన్ల నిడివిలో ఇన్ని పొరపాట్లు జరిగాయి’ అని నీషమ్‌ ట్వీటాడు. ‘వేడ్‌ ఫిర్యాదు చేయడం ఆసక్తికర ప్రశ్నను లేవనెత్తింది. నిర్దేశిత సమయం కన్నా ముందే రిప్లే ప్రదర్శిస్తే సమీక్షను తిరస్కరిస్తారా? ఈ వ్యవహారంలో మనం సమయాన్ని చూడాలి. అయితే నా ప్రశ్న మాత్రం చెల్లుబాటయ్యేదే’ అని హర్షభోగ్లే అన్నారు. ‘సరైన నిర్ణయమే. భారీ తెరపై రిప్లే తర్వాత సమీక్ష కోరకూడదు. అయితే రిప్లే ముందే వేశారా? లేదా 15 సెకన్లు గడిచాక ప్రదర్శించారా?’ అని ఆకాశ్‌ చోప్రా ప్రశ్నించాడు.

ఇవీ చదవండి
ధోనీని నేనూ మిస్‌ అవుతున్నా: కోహ్లీ
ధోనీ రికార్డుపై ‘కోహ్లీ’సేన కన్ను..


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని