Virat Kohli: అందుకోసం విరాట్ కోహ్లీ ఓపిక పట్టాలి: వీవీఎస్‌ లక్ష్మణ్

విరాట్ కోహ్లీ ఆటలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, అతడు టెస్టు క్రికెట్‌లో తిరిగి అత్యుత్తమ ఫామ్‌ని అందుకోవడానికి ఓపికగా ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ని ఆడాలని భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ సూచించారు. చాలారోజుల నుంచి కోహ్లీ

Published : 05 Dec 2021 21:05 IST

పుజారా కూడా నిరుత్సాహానికి గురై ఉంటాడన్న మాజీ బ్యాటర్‌

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ ఆటలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని, అతడు టెస్టు క్రికెట్‌లో తిరిగి అత్యుత్తమ ఫామ్‌ని అందుకోవడానికి ఓపికగా ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ని ఆడాలని భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ సూచించారు. చాలారోజుల నుంచి కోహ్లీ మూడంకెల స్కోరును చేయకుండానే ఔట్‌ అవుతున్నాడని, శతకం కరవుని తీర్చుకోవడానికి అతడు ఓపిక పట్టాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. త్వరలో విరాట్ శతకం బాదుతాడని, ఒక్కసారి సెంచరీ చేస్తే మునుపటిరీతిలో భారీగా పరుగులు చేస్తాడని లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో 36పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. 

కివీస్‌తో ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వచ్చిన శుభారంభాన్ని భారీ స్కోరుగా మలుచుకోవడంలో ఛెతేశ్వర్‌ పుజారా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా వచ్చి 47 పరుగులు చేసి ఔటయ్యాడు. దీనిపై వీవీఎస్‌ స్పందిస్తూ.. ‘‘టెస్టుల్లో పుజారా శతకం చేసి చాలా రోజులైంది. ఈ క్రమంలో మంచి అవకాశం మిస్‌ అయింది. సాధారణంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే పుజారా... ఈసారి ఓపెనింగ్‌కు దిగాడు. అయితే ఎంతో కాన్ఫిడెంట్‌గా బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులు వద్ద ఔట్‌ కావడం నిజంగా పుజారాను నిరుత్సాహానికి గురి చేసే ఉంటుంది. సెంచరీ చేయాలనే ఒత్తిడి మరికొన్ని రోజులు తప్పదు’’ అని పేర్కొన్నాడు.

ఇక, రెండో టెస్టు విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 325 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (150) శతకంతో రాణించాడు.న్యూజిలాండ్ బౌలర్‌ అజాజ్‌ పటేల్ 10 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. భారత బౌలర్లు చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 276/7 వద్ద డిక్లేర్‌ చేసి కివీస్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కివీస్ విజయం సాధించాలంటే మరో 400 పరుగులు చేయాలి. మరో ఐదు వికెట్లు పడగొడితే టీమ్‌ఇండియా విజయం సాధించి సిరీస్‌ని 1-0తో కైవసం చేసుకుంటుంది. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని