Rahul Dravid: మ్యాచ్‌ ఆలస్యం.. కోచ్‌ ద్రవిడ్‌పై జాఫర్‌ సెటైర్లు

ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఇప్పటికే ఒకటి ఓడిపోయి వెనుకంజలో ఉన్న భారత్‌.. పోటీలో నిలవాటంటే గెలవాల్సిన రెండో మ్యాచ్ చిత్తడి కారణంగా ఆలస్యమైంది.........

Updated : 26 Sep 2022 11:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌పుర్‌ వేదికగా భారత్‌, ఆసీస్‌ మధ్య రెండో టీ20 ఆలస్యంగా ప్రారంభమైంది. మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను 8 ఓవర్లకు కుదించారు. అయితే ఎలాంటి వర్షం లేకపోయినా చిత్తడి కారణంగా మ్యాచ్‌ ఆలస్యం కావడం పట్ల మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై సరదాగా సెటైర్లు వేశాడు. ‘కొంత వయసు వచ్చిన తర్వాత అత్తగారింటికి వెళ్తే.. కొన్ని విషయాలు సమయానికి ప్రారంభం కావు’ అంటూ ద్రవిడ్‌పై జాఫర్‌ సరదా వ్యాఖ్యలతో ట్వీట్‌ చేశాడు. రాహుల్‌ ద్రవిడ్‌ సతీమణి విజేత నాగ్‌పుర్‌లో జన్మించారు. తన తండ్రి పదవీ విరమణ తర్వాత వారి కుటుంబం నాగ్‌పుర్‌లోనే స్థిరపడింది.   

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో భారత్‌ 208 పరుగుల భారీ స్కోర్‌ చేసినప్పటికీ ఆసీస్‌ 4వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఆలస్యంగా ప్రారంభమైన రెండో మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 7.2 ఓవర్లలో 90 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(46 నాటౌట్‌: 20 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఆఖరి ఓవర్లో భారత్‌ విజయానికి 9 పరుగులు అవసరమైన సమయంలో క్రీజులో ఉన్న దినేశ్‌ కార్తీక్‌ వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇక చివరిపోరు ఈ నెల 25న హైదరాబాద్‌ వేదికగా జరగనుంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని