WI vs IND: అప్పుడు ఆడిన వాళ్లలో ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం: విరాట్ కోహ్లీ

టీమ్‌ఇండియా ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 2011లో భారత్ విండీస్‌లో పర్యటించిన విషయాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli) తాజాగా గుర్తు చేసుకున్నాడు. 

Published : 10 Jul 2023 11:56 IST

ఇంటర్నెట్ డెస్క్:  భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌ (West Indies)పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో కరేబియన్‌ జట్టుతో టీమ్‌ఇండియా (Team India) రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12 నుంచి డొమినికా వేదికగా మొదటి టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశాడు. ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ (Rahul Dravid) తో కలిసి దిగిన ఫోటోను విరాట్ పోస్ట్ చేస్తూ 2011లో వెస్టిండీస్‌లో తామిద్దరం భారత తరఫున ఆడిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. మరో విశేషమేమిటంటే.. అప్పుడు టీమ్‌ఇండియా తరఫున ఆడి ప్రస్తుత సిరీస్‌లో భాగం అవుతున్నది విరాట్ కోహ్లీ, ద్రవిడ్‌ మాత్రమే.

‘‘2011లో డొమినికాలో మేం చివరి టెస్ట్‌ ఆడాం. అప్పుడు భారత్‌కు ఆడిన వాళ్లలో ఇద్దరం (రాహుల్ ద్రవిడ్, కోహ్లీ) మాత్రమే ఈ సిరీస్‌లో భాగమవుతున్నాం. ఈ ప్రయాణం మమ్మల్ని విభిన్న సామర్థ్యాలతో ఇక్కడికి తీసుకువస్తుందని ఎప్పుడూ ఊహించలేదు’’ అనే క్యాప్షన్‌ను జోడించి ద్రవిడ్‌తో కలిసి దిగిన ఫొటోను విరాట్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2011లో టీమ్‌ఇండియా వెస్టిండీస్‌లో పర్యటించింది. విండీస్‌తో ఒక టీ20, ఐదు వన్డేలు, మూడు టెస్టులు ఆడింది. మొదటి టెస్టులో భారత్ 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో శతకం (112) బాదిన ద్రవిడ్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మిగతా రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు