Gavaskar: రోహిత్‌ శర్మ నుంచి ఎక్కువ ఆశించా.. ఆటగాళ్ల మధ్య గ్యాప్‌ పెరగడానికి అదీ ఒక కారణం: గావస్కర్‌

రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 10 Jul 2023 10:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  రోహిత్‌ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొడుతున్నా ఐసీసీ టోర్నీలో మాత్రం విఫలమవుతోంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌లో ఇంటిముఖం పట్టిన భారత జట్టు.. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ కెప్టెన్సీ పట్ల తాను సంతృప్తి చెందలేదని, సారథిగా అతని నుంచి మరింత మంచి ప్రదర్శన ఆశించానని సునీల్ గావస్కర్‌ పేర్కొన్నాడు.

‘‘నేను  రోహిత్ నుంచి చాలా ఎక్కువగా ఆశించాను. భారత్‌లో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. విదేశాల్లో గెలుపొందినప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. విదేశీ గడ్డలపై రోహిత్ కెప్టెన్సీ నన్ను నిరాశపర్చింది. టీ20 ఫార్మాట్‌లోనూ అలానే ఉంది. స్టార్‌ ఆటగాళ్లున్నా జట్టు ఫైనల్స్‌కు చేరుకోకపోవడం బాధ కలిగించింది’’ అని సునీల్ గావస్కర్‌ అన్నాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ మరింత జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరముందని గావస్కర్‌ పేర్కొన్నాడు. 

జట్టులో ఇది వరకు స్నేహితులుండేవారు.. ప్రస్తుతం సహచరులు (కొలీగ్స్‌) మాత్రమే ఉన్నారని అశ్విన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో సన్నీ ఏకీభవించాడు. ఆటగాళ్ల మధ్య ప్రేమ, అభిమానం లోపించదని, జట్టు రాణించకపోవడానికి ఇది కూడా ఒక కారణమని గావస్కర్‌ పేర్కొన్నాడు. ‘‘ఇది నిజంగా బాధకరమైన విషయం. మ్యాచ్‌ ముగియగానే ఆటగాళ్లందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. ఆట గురించే కాకుండా మ్యూజిక్, సినిమాలతో మీకిష్టమైన వాటి గురించి చర్చించుకోవాలి. ఈ మధ్య ప్రతి ఆటగాడికి ఒక్కో రూమ్‌ కేటాయిస్తున్నారు. గతంలో ఆటగాళ్లందరూ ఒకే గదిలో ఉండేవారు. ఆటగాళ్ల మధ్య గ్యాప్‌ పెరగడానికి ఇది ఒక కారణం’ అని సునీల్ గావస్కర్‌ వివరించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని