
సమర్థ సేవలకు సమున్నత పురస్కారాలు
విశిష్ట సేవల విభాగంలో రాష్ట్రం నుంచి ముగ్గురు ఎంపిక
ఈనాడు, హైదరాబాద్; రాష్ట్రంలో విధి నిర్వహణలో ప్రతిభ చాటుతున్న పోలీస్ బలగాలకు పలు పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ మంగళవారం వాటిని ప్రకటించింది. తెలంగాణ నుంచి పోలీస్ శౌర్య పతకం(పీఎంజీ) ఎవరికీ దక్కలేదు. విశిష్ట సేవల విభాగంలో టీఎస్ ఎస్పీ మూడో బెటాలియన్(ఇబ్రహీంపట్నం) కమాండెంట్ చాకో సన్నీ, పోలీస్ రవాణా సంస్థ(పీటీవో) హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరాజుకు రాష్ట్రపతి పోలీస్ పతకాలు(పీపీఎం) దక్కాయి.
సన్నీ 1984లో అప్పటి ఏపీఎస్‌పీ మొదటి పటాలం(యూసుఫ్‌గూడ)లో ఆర్‌ఎస్సైగా విధుల్లో చేరారు. ప్రతిష్ఠాత్మక గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. గ్రేహౌండ్స్‌లో 5వేల మందికి ‘జంగిల్ వార్‌ఫేర్ టాక్టిక్స్’లో శిక్షణ ఇచ్చారు. బోస్నియా, హెర్జెగోవ్నియా, సైప్రస్‌ల్లో ఐక్యరాజ్యసమితి శాంతిదళాల్లో పనిచేశారు. ‘కౌంటర్ టెర్రరిజం టాక్టిక్స్’లో లండన్, అమెరికాల్లో శిక్షణ పొందారు. విశిష్ట సేవల విభాగంలోనే అగ్నిమాపక అధికారి కాళహస్తి వెంకట కృష్ణకుమార్‌కూ పురస్కారం లభించింది. 1993లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. పలు అగ్నిప్రమాద ఘటనల్ని సమర్థంగా నియంత్రించినందుకు పురస్కారం దక్కింది. ప్రస్తుతం రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నారు.
- ప్రతిభావంతమైన సేవల విభాగంలో మైనారిటీ సంక్షేమశాఖ సంచాలకుడు(ఐపీఎస్ అధికారి) షానవాజ్ ఖాసిం, సైబరాబాద్ అదనపు డీసీపీ సంక్రాంతి రవికుమార్, భూపాలపల్లి అదనపు ఎస్పీ పుల్ల శోభన్‌కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ సుదర్శన్, ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ పొలగాని శ్రీనివాసరావు, ఐటీ సెల్ డీఎస్పీ గుడ్డేటి శ్రీనివాసులు, వనపర్తి డీఎస్పీ కేఎం కిరణ్‌కుమార్, ఇంటెలిజెన్స్ ఆర్‌ఎస్‌ఐ మహ్మద్ యాకూబ్‌ఖాన్, ఏడో బెటాలియన్(డిచ్‌పల్లి) ఏఆర్ ఎస్‌ఐ బెండి సత్యం, గ్రేహౌండ్స్ ఏఆర్ ఎస్‌ఐ ఎం. వెంకటరమణారెడ్డి, ఎనిమిదో బెటాలియన్(కొండాపూర్) హెడ్‌కానిస్టేబుల్ ఇలపండ కోటేశ్వరరావు, ఎన్‌పీఏ అసిస్టెంట్ కమాండెంట్ భూపేందర్‌కుమార్, ఎన్‌పీఏ కానిస్టేబుల్ అజయ్‌కు పోలీస్ పతకాలు దక్కాయి.
* జైళ్లశాఖలోని చీఫ్ హెడ్‌వార్డర్ పంతు, హెడ్‌వార్డర్లు రత్నారావు, నర్సింగ్‌రావులకు కరెక్షనల్ సర్వీసెస్ మెడల్ దక్కింది.