KUL-CHA : టీ20 లీగ్‌లో అద్భుత ప్రదర్శన.. వరల్డ్‌కప్‌లో ‘కుల్చా’ ద్వయం ఉంటుందా..?

 టీమ్‌ఇండియా క్రికెట్‌ జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంటుంది.  మరీ ముఖ్యంగా..

Published : 21 Apr 2022 10:05 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా క్రికెట్‌ జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో.  సీనియర్లతోపాటు యువ బౌలర్లు తమ స్థానం కోసం వేచి చూస్తూ ఉంటారు. భారత్‌ అంటే స్పిన్నర్ల ఫ్యాక్టరీ. కుంబ్లే-హర్భజన్‌.. తర్వాత యాష్‌-జడ్డూ..  ఈ వరుసలోనే కుల్‌దీప్‌ యాదవ్‌-యుజ్వేంద్ర చాహల్‌ (కుల్చా) టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. అయితే, గత మూడేళ్లుగా కుల్‌దీప్‌-చాహల్ జోడీకి అవకాశాలు బాగా తగ్గాయి. దీనికి కారణం ఏంటి.. మరిప్పుడు పరిస్థితి ఎలా ఉంది.. అనే విషయాలను ఓసారి అంచనా వేద్దాం..  

ఫామ్‌ కోల్పోయి.. 

చైనామన్‌ బౌలర్‌గా పేరొందిన కుల్‌దీప్‌ 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తొలి రెండేళ్లు చెలరేగిపోయాడు. వన్డే క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు చేసిన ఏకైక బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అలానే పొట్టి ఫార్మాట్‌లో టాప్‌-2 స్థానానికి (2019) చేరుకున్నాడు. కేవలం రెండు సంవత్సరాల్లో 50 వన్డేలు ఆడటం విశేషం. వంద వికెట్లను అత్యంత వేగంగా తీసిన భారత స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే, ఫామ్ కోల్పోవడంతోపాటు తనను ఎంతో ప్రోత్సహించిన ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం.. జడేజా, అశ్విన్‌ ఆల్‌రౌండర్ల పాత్రను పోషించడంతో కుల్‌దీప్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమైంది. ఆ తర్వాత అడపాదడపా మ్యాచ్‌లను ఆడినా స్థానం సుస్థిరంగా చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు 8 టెస్టుల్లో 26 వికెట్లు, 65 వన్డేల్లో 118 వికెట్లను తీశాడు.

చదరంగం నుంచి క్రికెట్‌కు.. 

కుల్‌దీప్‌ కంటే ఒక సంవత్సరం ముందు (2016) అరంగేట్రం చేసిన యుజ్వేంద్ర చాహల్‌  మణికట్టుతో అద్భుతాలు చేశాడు. టీ20ల్లో ఆరు వికెట్లు తీసిన లెగ్‌ స్పిన్నర్‌గా చాహల్ (6/25) రికార్డు సృష్టించాడు. డెబ్యూ చేసిన తదుపరి ఏడాదిలోనే పొట్టి ఫార్మాట్‌లో (23) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. టీ20 స్పెషలిస్ట్‌గా మారాడు. మంచి ఆటతీరును కనబరిచిన చాహల్‌కు 2021 టీ20 ప్రపంచకప్‌  జట్టులో స్థానం దక్కలేదు. స్పిన్‌ బౌలింగ్‌ను భర్తీ చేసేందుకు అశ్విన్‌, జడేజా ఉండటంతో చాహల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో సెలెక్షన్‌ కమిటీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 61 వన్డేల్లో  104 వికెట్లు, 54 టీ20ల్లో 68 వికెట్లను తీశాడు. క్రికెట్‌లోకి రాకముందు చాహల్‌ భారత్‌ తరఫున చెస్‌ ఆడాడు. ప్రపంచ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొన్నాడు. అయితే, స్పాన్సర్స్‌ లేకపోవడంతో క్రికెట్‌వైపు మళ్లాడు. 

అశ్విన్‌-జడ్డూ గైర్హాజరైతేనే.. 

ఆల్‌రౌండర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినివ్వడం, గాయపడటం వంటి సందర్భాల్లోనే మిగతా స్పిన్నర్లకు అవకాశం దొరుకుతోంది. అయితే, ఇటీవల అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి యువ ఆటగాళ్లు బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారు. దీంతో జట్టులో స్థానం కోసం పోటీ తీవ్రమైంది. ఈ క్రమంలో స్పెషలిస్ట్‌ స్పిన్నర్ల కోటాలో యుజ్వేంద్ర చాహల్‌ అప్పుడప్పుడైనా కొన్ని మ్యాచ్‌లను ఆడుతున్నాడు. కుల్‌దీప్‌ అయితే అదికూడా లేదు. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంక, వెస్టిండీస్‌తో సిరీస్‌ల్లో వీరిద్దరూ ఆడారు. భారత టీ20 లీగ్‌ గత సీజన్‌లో కుల్‌దీప్‌ ఆడిందే లేదు. ఇక చాహల్‌ అయితే 15 మ్యాచుల్లో 18 వికెట్లను తీశాడు. ఈ క్రమంలో మెగా వేలంలో చాహల్‌ను రాజస్థాన్‌ రూ. 6.50 కోట్లకు దక్కించుకుంది. దిల్లీ ఫ్రాంచైజీ రూ.2 కోట్లను వెచ్చించి కుల్‌దీప్‌ యాదవ్‌ను కొనుగోలు చేసింది. 

దుమ్మురేపుతున్న కుల్చా.. 

గత మూడేళ్ల (2019, 2020, 2021) సీజన్‌ను తీసుకుంటే కుల్‌దీప్‌ బౌలింగ్‌ ప్రభావం పెద్దగా లేదు. 2019 సీజన్‌లో తొమ్మిది మ్యాచుల్లో 4, 2020 సీజన్‌లో ఐదు మ్యాచులకుగాను ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. అయితే, ఈసారి మాత్రం ఇప్పటికే కేవలం ఐదు మ్యాచుల్లోనే 11 వికెట్లు తీసి దిల్లీ బౌలింగ్ విభాగంలో కీలకంగా మారాడు. ఎకానమీ రేటు (8.24) మరీ ఎక్కువేమీ లేదు. ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శన 4/35. 

అదేవిధంగా యుజ్వేంద్ర చాహల్‌ చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు (17) తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఆరు మ్యాచుల్లో 7.33 ఎకానమీతో పదిహేడు వికెట్లను కూల్చాడు. వీటిల్లో ఒక హ్యాట్రిక్‌తో సహా ఐదు వికెట్ల ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అత్యుత్తమ బౌలింగ్‌ 5/40. కోల్‌కతాపై హ్యాట్రిక్‌ తీసి ఈ సీజన్‌లో తొలిసారి ఘనత సాధించిన బౌలర్‌గా మారాడు. 

టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కేనా..?

అశ్విన్‌, జడేజా వంటి ఆల్‌రౌండర్లు ఉన్నా స్పెషలిస్ట్‌ కోటాలో ఒకరికి ఛాన్స్‌ ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుత సీజన్‌లోనూ వీరిద్దరి ప్రదర్శన అద్భుతంగా ఉండటం.. మరోవైపు జడేజా, అశ్విన్‌ పెద్దగా ఫామ్‌లో లేకపోవడం కుల్‌దీప్‌, చాహల్‌కు కలిసొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఆసీస్‌ పిచ్‌లపైనా విభిన్నంగా బౌలింగ్‌ చేయగలమని వీరిద్దరూ ఎప్పుడో నిరూపించారు. కుల్‌దీప్‌ తొలి టెస్టు మ్యాచ్‌ కూడా సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగానే ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్ల (5/99) ప్రదర్శన చేశాడు. అదే విధంగా చాహల్‌ కూడా మెల్‌బోర్న్‌ మైదానంలో ఆసీస్‌ మీద (6/42) విజృంభించాడు. ఆసీస్‌ వేదికగా జరగబోయే పొట్టి ప్రపంచకప్‌ పోటీల్లో ‘కుల్చా’ ద్వయానికి సెలెక్షన్‌ కమిటీ చోటు కల్పిస్తుందో లేదో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని