ఈ యా‌ప్‌లతో.. ఒత్తిళ్లు చిత్తు! 

ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేని పని. దీంతో ఒత్తిడి. ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 40 నుంచి 50 కోట్ల జనాభా ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు.

Updated : 16 Nov 2020 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేని పని. దీంతో ఒత్తిడి. ఇప్పుడు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 40 నుంచి 50 కోట్ల జనాభా ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతోంది. కొంత మంది వైద్యులను సంప్రదిస్తుంటే మరికొంత మంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారిలో వారే సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ ‘మెంటల్‌ వెబ్‌ బీయింగ్‌’ యాప్స్‌. వీటితో చాలా రకాల మానసిక ఒత్తిళ్లను చిత్తు చేయొచ్చు. వైద్య చికిత్సలో సహాయానికీ ఉపయోగించుకోవచ్చు.

చెడుని దూరం చేద్దాం
మీకెక్కువగా చెడు ఆలోచనలు వస్తున్నాయా? అవే మిమ్మల్ని చుట్టుముడుతున్నాయా? పాజిటివ్‌గా ఆలోచించడం మీ వల్ల కావట్లేదా? ఎప్పూడూ నిరాశగానే సమయం గడుపుతున్నారా? అయితే ఈ యాప్‌ ప్రయత్నించండి. పేరు Happify. ఇందులో మానసిక వైద్యులు రూపొందించిన సుమారు 100కి పైగా కోర్సులు ‘ట్రాక్స్‌’ పేరుతో అందుబాటులో ఉన్నాయి. పని, డబ్బు, ఆరోగ్యం, ప్రశాంతత, కుటుంబం, సంబంధాలు, యోగా, ధ్యానం తదితర విభాగాలవారీగా ఈ ట్రాక్‌లను పొందుపరిచారు. యాప్‌లో ఎకౌంట్‌ని రూపొందించుకున్న తదుపరి మీకు కావాల్సిన విభాగాన్ని ఎంచుకుంటే సరి. ప్రతి ట్రాక్‌లో సమాచారం, ఫీచర్‌ కథనాలు, ఆటలు, టాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. మీరు మెరుగవుతున్న విధానాన్నిబట్టి ఫొటోలతో జర్నల్‌ రాయొచ్చు. ఇదో సామాజిక వేదిక కూడా. దీంతో ఇతరులను ఫాలో అవచ్చు. వారి జర్నల్‌కి లైక్‌, కామెంట్‌ చేయొచ్చు.

ప్రశ్నకి సమాధానం చాలు
ఈ మధ్య ఎక్కువ విచారంగా ఉంటున్నారా? ఏదో విషయం తెగ ఇబ్బంది పెడుతోందా! అయితే ఈ యాప్‌ని తప్పక ప్రయత్నించాలి. పేరు ‌MoodTools. ఇది డిప్రెషన్‌ నుంచి కోలుకునేలా చేసే ఓ టూల్. ఖాతా తెరిచిన తర్వాత ‘పేషంట్‌ హెల్త్‌ క్వశ్చనీర్‌ (పీహెచ్‌క్యూ)’ పేరుతో మానసిక వైద్యులు రూపొందించిన కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి సమాధానాలు గుర్తిస్తే చాలు. మీ సమస్య తెలుసుకుని మానసిక స్థితిని అంచనా వేస్తుంది. దానికనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలు, కోర్సులను తెలుపుతుంది. దీనిద్వారా డిప్రెషన్‌ నుంచి కోలుకునేందుకు కావాల్సిన సమగ్ర సమాచారాన్నీ తెలుసుకోవచ్చు. వ్యాధి లక్షణాలు, కారణాలు, రకాలు, చికిత్స తదితర సమాచారం అందుబాటులో ఉంది. లక్షణాలకి అనుగుణంగా మీ జీవనవిధానాన్ని మార్చుకునేందకు కావాల్సిన ఓ గైడ్‌నీ అందిస్తోంది. అంతేకాదు... సీబీటి, ఏసీటీ, మైండ్‌ఫుల్‌ మెడిటేషన్‌, ఆత్మహత్యలను ప్రేరేపించే ఆలోచనల నుంచి విముక్తి కలిగించే ‘ప్రివెన్షన్‌ ఎక్సర్‌సైజెస్‌’ అందుబాటులో ఉన్నాయి.    

తినే సమస్యలకి చెక్‌ 
మీకు తెలుసా కొందరు ఎక్కువ ఒత్తిడికి లోనైతే ఎక్కువగా తినేస్తారంటా! డిప్రెషన్‌లో ఉన్న మరికొందరికి అసలు ఆహారం తీసుకోవాలన్న ధ్యాసే ఉండదంట. ఆకలి లేకపోవడం (anorexia), అమితంగా తినడం (binge-eating), మితాహారము ఎక్కువ సార్లు తీసుకోవడం (bulimia).. ఇలా ఆకలి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారా? అయితే మీరీ యాప్‌ని తప్పక వాడాల్సిందే. పేరు RR Eating Disorder Management.  మీ రోజువారీగా తీసుకుంటున్న ఆహారాన్ని లాగ్‌ రూపంలో ఫొటోలు, ప్రొటీన్‌ వివరాలు, ఆకలి ఆలోచనలు, భావాలను రికార్డు చేస్తుంది. వివరాలను గోప్యంగా ఉంచుతుంది. మీ ఆహారపు రుగ్మతలకనుగుణంగా వారపు సెషన్లు నిర్వహిస్తుంది. లక్ష్యాలను ఏర్పరుచుతుంది. వీటిని మీ వైద్యునికీ చూపించొచ్చు. దీంతో మీ సమస్య వారికి సులువుగా తెలిసేవీలుంటుంది. అంతేకాదు మెడిటేషన్‌ వీడియోలతోపాటు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర వ్యక్తులతో మాట్లాడొచ్చు. ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. 

చికిత్సకి సులువుగా..
మానసిక స్థితి కుదురుగా ఉండటం లేదా! ‘బై పోలార్‌ డిజార్డర్‌’తో ఇబ్బంది పడుతున్నారా? అయితే emoods యాప్‌ ప్రయత్నించండి. ఇది రోజువారీ మానసిక స్థితిని ట్రాక్‌ చేస్తుంది. నాలుగు ఆప్షన్ల (నన్‌, మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌) ద్వారా రోజువారీగా మీ డిప్రెషన్‌ స్థాయులు‌, ఉల్లాసవంతమైన సమయం, నిద్ర, చిరాకు, కోపం తదితర స్థితులను తెలుసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు డేటాని క్యాలెండర్‌ వ్యూలో చూడవచ్చు. చార్ట్‌, గ్రాఫ్‌, రిపోర్టుల ద్వారా మెరుగుదలను అంచనా వేసుకోవచ్చు. దీన్నే పీడీఎఫ్‌ రూపంలో మార్చి వైద్యునికీ చూపొచ్చు. దీంతో రోజువారీ మానసిక స్థితి వైద్యులకు సులువుగా అర్థమవుతుంది. 

 

సంతోషకర జీవితానికి..
ఈ Innerhour యాప్‌లో మొదట చిన్నపాటి క్విజ్‌ ఉంటుంది. దీనిలో ఇచ్చిన జవాబుల్ని బట్టి మానసిక స్థితిని అంచనా వేస్తుంది. 28-రోజుల ప్రణాళికను రూపొందించి ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలను చూపుతుంది. ఈ యాప్‌లో ఆరు ముఖ్యమైన స్వయం సహాయక సాధనాలు ఉన్నాయి. వీటితో చిన్నచిన్న మార్పుల ద్వారా డిప్రెషన్‌ని అధిగమించొచ్చు. ఓ ప్రణాళిక ప్రకారం మంచి నిద్రను ఏర్పరుచుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఒత్తిడి స్థాయిలను తనిఖీ చేస్తూ నియంత్రణలో ఉంచుకోవచ్చు. కోపాన్ని అంచనా వేసుకుంటూ తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. కావాల్సిన నైపుణ్యాలను పెంచుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించొచ్చు. వీటితోపాటు 300కి పైగా చికిత్స ఆధారిత స్వయం సహాయక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. బాధగా అనిపించినప్పుడు చాట్‌బాట్‌ ‘అల్లి’తో మాట్లాడొచ్చు. ఆందోళన, నిరాశను తగ్గించేందుకు సహాయపడే సూచనల్ని పొందవచ్చు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని