Cm Kcr: మాదకద్రవ్యాల అక్రమ రవాణా.. 20న కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం

రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ నెల 20న ప్రగతిభవన్‌లో పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు

Published : 18 Oct 2021 19:43 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ నెల 20న ప్రగతిభవన్‌లో పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా సీఎస్ సోమేశ్ కుమార్, హోంశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రధాన కార్యదర్శులు, డీజీపీ మహేందర్ రెడ్డి పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర మాదకద్రవ్యాల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు సమీక్షకు హాజరుకానున్నారు. తమ జిల్లాల పరిధిలో నెలకొన్న తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులు సమీక్షకు రావాలని సీఎం ఆదేశించారు. మాదకద్రవ్యాల బారిన పడి యువత భవిష్యత్తు నిర్వీర్యం కాకూడదనే లక్ష్యంతో సమావేశంలో కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా డ్రగ్స్ కల్చర్ మితిమీరిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కఠిన చర్యలు తీసుకొనేందుకు సీఎం కేసీఆర్ ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

పోడుభూముల సమస్య పరిష్కారానికి..

పోడుభూముల సమస్య పరిష్కారంతో పాటు అడవుల పరిరక్షణ, హరితహారంపై సీఎం కేసీఆర్ ఈ నెల 23న విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో ఆ రోజు మొత్తం సీఎం సమావేశమై అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అటవీ, గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అటవీ అధికారులు, కన్జర్వేటర్లతో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో పరిష్కరించడంతో పాటు అడవి తరిగిపోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించి సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేయనున్నారు. హరితహారం ఫలితాలను విశ్లేషించి మరింత విస్తృత స్థాయిలో ఫలితాలను రాబట్టేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యచరణపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని