Telangana News: మోదీ వ్యాఖ్యలపై నిరసన.. తెలంగాణ వ్యాప్తంగా తెరాస ఆందోళనలు

ఏపీ విభజనపై ప్రధాని మోదీ నిన్న రాజ్యసభలో అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మంత్రి కేటీఆర్‌ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు..

Updated : 09 Feb 2022 18:52 IST

హైదరాబాద్: ఏపీ విభజనపై ప్రధాని మోదీ నిన్న రాజ్యసభలో అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా తెరాస నేతలు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 

సికింద్రాబాద్‌లో తెరాస కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు, జెండాలతో బైక్‌ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. మోతీనగర్‌, రాజీవ్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌ మీదుగా తెరాస నేతలు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పాల్గొని నిరసన తెలిపారు. కూకట్‌పల్లిలో తెరాస శ్రేణులు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కృష్ణారావు నేతృత్వంలో తెరాస కార్యకర్తల బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

హైదరాబాద్‌లోని అజంపురా చౌరస్తాలో తెరాస కార్యకర్తలు నిరసనకు దిగారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. చాదర్‌ఘాట్‌ చౌరస్తా వరకు తెరాస కార్యకర్తలు బైకు ర్యాలీ నిర్వహించారు. గన్‌పార్క్‌ వద్ద తెరాస నాయకులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా ప్రధాని వ్యాఖ్యల చేశారని నిరసిస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. జేబీఎస్ వరకు ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు.

పిర్జాదిగూడ, బోడుప్పల్ నగర పాలక సంస్థల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డి.. ఘట్ కేసర్, పోచారం మున్సిపాలిటీలలో ఛైర్మన్‌లు పావని యాదవ్, బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వరంగల్‌లో మేయర్‌ గుండు సుధారాణి నిరసనలో పాల్గొన్నారు. 

కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో తెరాస శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భాజపా పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మేయర్‌ సునీల్‌రావు, తదితర తెరాస నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ ఆధ్వర్యంలో తెరాస కార్యకర్తలు భారీ బ్యాక్‌ ర్యాలీ చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని