‘గృహ’ణం వీడేనా!

మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఇంకా స్థలాల కోసం వెతుకులాట.. కొన్నిచోట్ల పిల్లర్ల స్థాయిలోనే ఆగిన పనులు.. నిర్మాణం పూర్తయినచోట కొలిక్కిరాని లబ్ధిదారుల ఎంపిక... వెరసి సొంతింటి కల సాకారానికి పేదలకు ఎదురుచూపులు తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండు పడకగదుల ఇళ్ల పథకం పరిస్థితి ఇది....

Updated : 14 Aug 2021 06:04 IST

60 శాతం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లు
పంపిణీ మాత్రం పదో వంతు లోపే
ముందుకు సాగని లబ్ధిదారుల ఎంపిక
పిచ్చిమొక్కలు... చోరీలతో శిథిలమవుతున్న ఇళ్లు
పలుచోట్ల పునాదుల్లోనే ఆగిపోయిన నిర్మాణాలు
ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే యంత్రాంగం


అర్ధంతరంగా ఆగాయి.. కలలు చెదిరాయి

సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారు తిప్పాపూరు.. వేములవాడకు నాలుగేళ్ల కిందట 800 ఇళ్లు మంజూరైతే, 144 ఇళ్ల నిర్మాణం తిప్పాపూరులో చేపట్టారు. చవుడు నేల కావడంతో చిన్నపాటి వానకే నీళ్లు ఊరుతూ పైకి వస్తున్నాయి. దీంతో ఏడాదిన్నరగా ఇక్కడ పిల్లర్లు, శ్లాబుల దశలో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. మిగిలిన 656 ఇళ్లకు ఇంకా స్థలాల కోసం వెతుకుతున్నారు.


మంజూరై ఏళ్లు గడుస్తున్నా ఇంకా స్థలాల కోసం వెతుకులాట.. కొన్నిచోట్ల పిల్లర్ల స్థాయిలోనే ఆగిన పనులు.. నిర్మాణం పూర్తయినచోట కొలిక్కిరాని లబ్ధిదారుల ఎంపిక... వెరసి సొంతింటి కల సాకారానికి పేదలకు ఎదురుచూపులు తప్పట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రెండు పడకగదుల ఇళ్ల పథకం పరిస్థితి ఇది. లబ్ధిదారులపై రూపాయి భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ఉచితంగా వీటిని నిర్మించి ఇవ్వనుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పథకం పనులు గుత్తేదారుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో పాటు నిధుల కొరతతో తీవ్ర ఆలస్యమవుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకున్నచోట మాత్రం వేగంగా సాగుతున్నాయి.1.80 లక్షల ఇళ్ల వరకు నిర్మాణం పూర్తయ్యిందని గృహనిర్మాణశాఖ చెబుతున్నా, వాటిలో లబ్ధిదారులకు అప్పగించినవి పదో వంతు లోపే. జిల్లా కేంద్రం భూపాలపల్లిలో ఇళ్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లయ్యింది. విద్యుత్తు, ఫంక్షన్‌హాల్‌ ఇలా అన్ని సౌకర్యాలు కల్పించారు. రెండువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. కొన్ని ఇళ్ల తాళాలను దొంగలు పగలగొట్టారు. మరికొన్ని ఇళ్లలో విద్యుత్తు తీగలు కోసుకెళ్లారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి 30 ఇళ్లు మంజూరైతే.. బిల్లులు రాక, నీటి సౌకర్యం లేక పునాదిదశలో ఆగాయి. మొరవానిగూడెం, ఉప్పెడు, ఆలుబాకకు 30 ఇళ్ల చొప్పున మంజూరైనా గుత్తేదారులు ముందుకు రాక పనులు మొదలుకాలేదు.

రెండేళ్ల క్రితమే పూర్తయినా...

హబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం వెన్నారంలో 70 ఇళ్లు మంజూరైతే 18 ఇళ్ల నిర్మాణం రెండేళ్ల కిందటే పూర్తయ్యింది. దారి లేదన్న కారణంతో 52 ఇళ్ల పనుల్ని గుత్తేదారులు ఏడాదిన్నర క్రితం నిలిపివేశారు. పూర్తయినవాటినీ లబ్ధిదారులకు కేటాయించలేదు. ఆ ఇళ్ల చుట్టూ పొదలు కమ్మేశాయి. కిటికీల అద్దాలు పగిలాయి.

నాలుగేళ్లకు పనులు..  రెండేళ్లుగా పునాది దశలోనే

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రానికి ఆరేళ్ల కిందట 54 ఇళ్లు మంజూరయ్యాయి. నాలుగేళ్ల ఆలస్యంగా మొదలైన పనులు పునాది దశలోనే ఆగిపోయాయి. కొడకంచిలో 50 ఇళ్లు మంజూరైతే రెండేళ్ల క్రితం నిర్మాణం మొదలైంది. శ్లాబ్‌ దశలో ఆగిపోయాయి.

అయిదేళ్లుగా ఆగిపోయి...

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేదరమెట్ల గ్రామానికి 50, ములకలపల్లికి 51, వేములపల్లికి 61.. మొత్తం 162 ఇళ్లు అయిదేళ్ల కిందట మంజూరయ్యాయి. పిల్లర్లు, శ్లాబు దశలోనే పనులు ఆగిపోయాయి. దీంతో చుట్టూ పిచ్చి చెట్లు పెరుగుతున్నాయి.

* నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో 285 కుటుంబాలు సొంతింటి కోసం ఎదురుచూస్తుంటే, మూడేళ్ల కిందట 30 ఇళ్లు మంజూరయ్యాయి. గత ఏడాది నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇళ్ల కిటికీలు, తలుపులు ఊడిపోతున్నాయి.

* మహబూబ్‌నగర్‌ శివారు దివిటిపల్లిలో 1024 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. జులైలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ వచ్చి 100 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. మిగిలినవారికి త్వరలో ఇస్తామని చెప్పారు.

* నాగర్‌కర్నూల్‌ జిల్లాకు 5,200 ఇళ్లు, నారాయణపేట జిల్లాకు 520 ఇళ్లు మంజూరైతే.. ఈ రెండుచోట్ల ఒక్క ఇంటి నిర్మాణమూ పూర్తికాలేదు. నాగార్జునసాగర్‌, మునుగోడు నియోజకవర్గాలకు కలిపి 2,800 ఇళ్లు మంజూరు చేసినా ఒక్కటీ మొదలుపెట్టలేదు.

నగదు సాయం కోసం ఎదురుచూపులు

సొంత స్థలం ఉన్న అర్హులకు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం చేస్తామని రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది నుంచి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి. కానీ దీనికి సంబంధించిన విధివిధానాలు ఇప్పటివరకు ఖరారు కాలేదు.


కారణాలు ఇవీ...

*  ఇళ్ల నిర్మాణం పూర్తయినా, చాలాచోట్ల లబ్ధిదారుల ఎంపిక జరగట్లేదు. కొన్నిచోట్ల ఎంపిక చేసినా అనర్హులకు ఇస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఆటంకాలేర్పడ్డాయి. మరికొన్ని గ్రామాల్లో ఇళ్లు లేనివారు భారీ సంఖ్యలో ఉంటే తక్కువ ఇళ్లు కట్టారు. మిగిలినవారి మాటేంటని స్థానికులు నిలదీస్తుండంతో పంపిణీ ముందుకు సాగలేదు.

*  చాలాచోట్ల అధికారుల పర్యవేక్షణ సరిగా ఉండట్లేదు.

*  పలుచోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయినా చిన్నచిన్న ఆటంకాలతో ఎంపిక, పంపిణీ ప్రక్రియల్ని నిలిపివేస్తున్నారు.

*  నిర్మాణం ఆర్థికంగా గిట్టుబాటు కాదని గుత్తేదారులు అనాసక్తి చూపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ చూపడంతో అయిష్టంగా పనులు చేపడుతున్నారు. బిల్లులు రాకపోవడంతో పలుచోట్ల పనులు ఆలస్యమవుతున్నాయి. కొందరు పూర్తిగా నిలిపేస్తున్నారు.

*  నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, భూములు దొరక్కపోవడం ప్రధాన కారణాలు.


గుత్తేదారు ఒత్తిడితో  ఆగిన లబ్ధిదారుల ఎంపిక!

ల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి 540 ఇళ్లు మంజూరైతే 384 ఇళ్ల నిర్మాణం ఏడాది కిందటే పూర్తయ్యింది. లబ్ధిదారుల ఎంపిక జరగకుండా బిల్లు కోసం గుత్తేదారు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పరిసరాల్లో పిచ్చిమొక్కలు మొలిచాయి. కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాత్రివేళ ఇక్కడ మందుబాబులు హల్‌చల్‌ చేస్తున్నారు.

* మేడ్చల్‌ జిల్లా డి.పోచంపల్లిలో ఏడాది క్రితమే 1610 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మురుగునీటి ఔట్‌లెట్‌కు స్థలం లేక లబ్ధిదారుల ఎంపిక చేయట్లేదు. ఇక్కడ కరెంటు వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు.


హనుమకొండ

నుమకొండ బాలసముద్రంలో జితేందర్‌నగర్‌ కాలనీ ప్రాంతమిది. స్థానికంగా పూరిళ్లలో నివసించే 592 కుటుంబాలకు ఆరేళ్లక్రితం ఇళ్లు మంజూరయ్యాయి. వారున్నచోట బహుళ అంతస్తుల భవనాలు కట్టారు. లబ్ధిదారులు పక్కనే పూరిళ్లు వేసుకుని సొంతింటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యి రెండేళ్లు దాటినా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదు. వర్షం పడ్డప్పుడల్లా వీరికి కష్టాలు తప్పట్లేదు.


తట్టిఅన్నారం

తొమ్మిదేసి అంతస్తులతో కనిపిస్తున్న ఈ అపార్టుమెంట్లు పేదల కోసం కట్టినవే. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ తట్టి అన్నారంలో ఏడు బ్లాకుల్లో 1296 ఫ్లాట్లు నిర్మించారు. నిర్వహణ ఖర్చుల కోసం వాణిజ్య దుకాణ సముదాయమూ కట్టారు. నిర్మాణం పూర్తయ్యి ఆరునెలలు కావస్తున్నా లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. సాయంత్రమైతే ఇక్కడ మందుబాబులు చేరిపోతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని