కేసీఆర్‌ది హుజూరాబాద్‌ ఓటమి గోస

హుజూరాబాద్‌ తీర్పు వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చి.. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేలా మాట్లాడుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్‌లో 97 శాతం రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంతో... వారిని భయపెట్టే ప్రయత్నాలను తెరాస ప్రభుత్వం చేస్తోందన్నారు. దిల్లీలోని తన అధికారిక నివాసంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావులతో కలిసి కేంద్ర మంత్రి సోమవారం విలేకరులతో మాట్లాడారు.

Updated : 30 Nov 2021 05:52 IST

రైతుల్ని భయపెట్టే ప్రయత్నం

వానాకాలం పంట ఆఖరి గింజ వరకు కొంటాం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం

దిల్లీలో విలేకరులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, చిత్రంలో ఎంపీలు సంజయ్‌, బాపురావు

ఈనాడు, దిల్లీ: హుజూరాబాద్‌ తీర్పు వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చి.. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేలా మాట్లాడుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్‌లో 97 శాతం రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంతో... వారిని భయపెట్టే ప్రయత్నాలను తెరాస ప్రభుత్వం చేస్తోందన్నారు. దిల్లీలోని తన అధికారిక నివాసంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావులతో కలిసి కేంద్ర మంత్రి సోమవారం విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఓటమి, బండి సంజయ్‌ పాదయాత్రతో కేసీఆర్‌కి నిద్ర పట్టడం లేదని విమర్శించారు. తన కుమారుడు సీఎం కాలేరనే  పుత్రవాత్సల్యం తాలూకూ బాధ పార్లమెంట్‌కు చేరిందని ఎద్దేవా చేశారు.

అన్నదాతలు ఆందోళన చెందవద్దు

వానాకాలం పంట ఆఖరి గింజ వరకు కేంద్ర ప్రభుత్వం కొంటుందని తెలంగాణలో ఎంత పంట పండినా కొనుగోలు చేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. ప్రస్తుత ఆందోళనలతో కేంద్రమే ధాన్యం కొంటుందన్న విషయం రైతులకు తెలిసిపోయిందన్నారు. ధాన్యం సేకరణలో ఏళ్లుగా ఉన్న విధానాన్నే అవలంబిస్తున్నామని, కొత్తగా తాము ఏవిధానం తీసుకురాలేదని కిషన్‌రెడ్డి అన్నారు. ఓవైపు రాష్ట్రంలో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోతుంటే దాన్ని కొనకుండా వచ్చే యాసంగి పంటపై రాష్ట్రప్రభుత్వం స్పష్టత కోరడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పుడు బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. 2014లో తెలంగాణలో ధాన్యం సేకరణకు రూ.3,404 కోట్లు వెచ్చిస్తే.., గతేడాది రూ.26,641 కోట్లను కేంద్రం వ్యయం చేసిందని తెలిపారు. రాష్ట్రం నుంచి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని కేంద్రం లక్ష్యం విధిస్తే ఇప్పటివరకు సగం ధాన్యం కూడా కొనలేదని విమర్శించారు. కేంద్రం ఇస్తోన్న ఆహార భద్రత బియ్యాన్ని తెరాస నాయకులు రీసైక్లింగ్‌ చేసి ఎఫ్‌సీఐకు అందించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు తెరాస ఎమ్మెల్యేల సహకారం ఉందన్నారు. ఎవరా ఎమ్మెల్యేలు అని ప్రశ్నించగా.. టీవీల్లో వచ్చిన కథనాలనే తాను చెబుతున్నానని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. పంజాబ్‌లో మొత్తం ధాన్యం కొంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారని.. అక్కడ వరి ఒక పంట మాత్రమే వేస్తారని తెలిపారు. తమకు రాష్ట్రాల మధ్య వైరుధ్యం లేదని, తెరాస ప్రభుత్వానికే గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లకు ఒకలా.. ఇతర నియోజకవర్గాలకు మరోలా విధానం ఉంటుందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని