
ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్‌ఎంబీ బృందం
శాంతినగర్, న్యూస్‌టుడే: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల పరిధిలోని ఆర్డీఎస్ ఆనకట్ట, కాల్వలను శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) బృందం పరిశీలించింది. బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై, సబ్ కమిటీ సభ్యుడు శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు ఆర్డీఎస్‌లో నీటి వాటా, దీని ద్వారా వాడుకుంటున్న నీరు, మరమ్మతులు, ఆనకట్ట పరిస్థితి గురించి ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక పరిధిలోని కాల్వ వెంట తిరిగారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని సింధనూర్ ప్రధాన కాల్వ రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, సుంకేసుల బ్యారేజీలను పరిశీలించి తుంగభద్ర నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వాడుతున్న నీటి వివరాలకు సంబంధించిన సమాచారం తీసుకున్నారు. వారి వెంట కేఆర్‌ఎంబీ ఎస్‌ఈ అశోక్, ఆర్డీఎస్ డీఈఈలు, ఏఈలు ఉన్నారు.