Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు

Air India Express: దాదాపు 300 మంది క్యాబిన్‌ క్రూ అనారోగ్య కారణంతో సెలవు పెట్టినట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది. దీంతో దాదాపు 80కి పైగా సర్వీసులు రద్దయ్యాయి.

Updated : 08 May 2024 13:14 IST

దిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు (Air India Express) చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 విమాన సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణంతో సెలవు పెట్టడమే ఇందుకు కారణం. సంస్థలో కొన్ని విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు 300 మంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లినట్లు సమాచారం.

కొంతకాలంగా ‘క్యాబిన్‌ క్రూ’లో ఓ వర్గం అసంతృప్తితో ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఏఐఎక్స్‌ కనెక్ట్‌, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విలీన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సిబ్బంది పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ విషయాన్ని గత నెల కంపెనీ దృష్టికి ‘ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌’ తీసుకెళ్లింది. సిబ్బందిలో అందరినీ సమానంగా చూడడం లేదని ఆరోపించింది. ఇది తమ స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని పేర్కొంది.

అకస్మాత్తుగా విమానాలను రద్దు చేయడంపై బుధవారం ఉదయం పలువురు ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్షమాపణలు చెప్పింది. ఏడు రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని సూచించింది. లేదా రిఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ప్రస్తుతం సెలవులో ఉన్న తమ సిబ్బందితో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

మరో విమానయాన సంస్థ విస్తారాలోనూ నెలక్రితం ఇదే తరహా సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. ఈ రెండూ టాటా గ్రూప్‌నకు (TATA Group) చెందిన సంస్థలే కావడం గమనార్హం. విమానయాన వ్యాపారాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏఐఎక్స్‌ కనెక్ట్‌ను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో.. అలాగే విస్తారాను ఎయిరిండియాలో టాటా గ్రూప్‌ విలీనం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని