India-Canada: ‘రెడ్‌లైన్‌ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్‌ హెచ్చరిక

India-Canada: కెనడా గడ్డ నుంచి సిక్కు వేర్పాటువాద గ్రూప్‌లు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ దేశంలో భారత రాయబారి అన్నారు.

Updated : 08 May 2024 12:29 IST

ఒట్టావా: నిజ్జర్‌ హత్య కేసు విషయంలో కెనడాతో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఒట్టావాలోని భారత హైకమిషనర్‌ (India High Commissioner) సంజయ్‌ కుమార్‌ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సిక్కు వేర్పాటువాద గ్రూప్‌ (Sikh Separatist Groups)లు రెడ్‌లైన్‌ దాటుతున్నారని హెచ్చరించారు. కెనడా గడ్డ నుంచి భారత భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించే తన ప్రధాన ఆందోళన అని అన్నారు.

నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయులను ఇటీవల కెనడా (Canada) పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై సంజయ్‌ వర్మ (Sanjay Kumar Verma) తొలిసారిగా స్పందించారు. ‘‘ద్వంద్వ జాతీయతను భారత్‌ ఎన్నటికీ గుర్తించదు. ఎవరైనా వలస వస్తే వారిని విదేశీయులుగానే పరిగణిస్తాం. భారత ప్రాదేశిక సమగ్రతపై దుష్టశక్తుల కన్ను పడింది. తమ స్వస్థలాన్ని భారత్‌ నుంచి విడదీయాలని చూస్తున్న కొందరు.. తమ చర్యలతో రెడ్‌లైన్‌ (Red Line) దాటుతున్నారు. దీన్ని న్యూదిల్లీ దేశ భద్రతకు ముప్పుగానే పరిగణించి నిర్ణయాలు తీసుకుంటుంది జాగ్రత్త..!’’ అని రాయబారి హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత

ఈ సందర్భంగా భారత్‌-కెనడా (India - Canada) మధ్య దౌత్య విభేదాల గురించి ఆయన స్పందించారు. ‘‘ఇటీవల కొంతమంది భారత సంతతి కెనడియన్లు దశాబ్దాల క్రితం నాటి సమస్యలను మళ్లీ లేవనెత్తి ఇరు దేశాల మధ్య ప్రతికూల వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాన్ని కెనడా అపార్థం చేసుకోవడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. సమయం చూసుకుని దీనిపై ఇరు దేశాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటాయి’’ అని వర్మ అన్నారు.

ఇటీవల కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలు వెలుగుచూడటం వివాదాస్పదమైంది. దీనిపై భారత్‌ (India) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. నేర, వేర్పాటువాద శక్తులకు కెనడాలో సురక్షితమైన ఆశ్రయం కల్పించడాన్ని మానుకోవాలని పిలుపునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు