icon icon icon
icon icon icon

యూపీలో ఆఖరి దశ ఆసక్తికరం.. భాజపా, మిత్రపక్షాలకు కీలకం..

యూపీలో మూడు దశల్లో 26 నియోజకవర్టాల్లో పోలింగ్‌ ముగిసింది. మరో 54 స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్‌ జరగనుంది.

Updated : 08 May 2024 12:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా నిలిచే ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే మూడు దశల్లో 26 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. తదుపరి దశ పోలింగ్‌కు ఆ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఇక ఇక్కడ ఏడో దశ పోలింగ్‌ అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే చివరి దశలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి ఉంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానం.. గోరఖ్‌పూర్‌ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. దీంతో ఈ లోక్‌సభ సీట్లో భాజపా అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడంపై యోగి దృష్టి పెట్టారు.

యూపీలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతుండగా.. ఆఖరి దశలో 13 స్థానాలు ఉన్నాయి. జూన్‌ 1న పోలింగ్‌ జరగనుండగా.. ఈ నెల 7న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశ భాజపా, ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్‌(ఎస్‌)కు కీలకం. గత ఎన్నికల్లో ఇక్కడి 13 స్థానాల్లో 11 ఎన్‌డీఏ కూటమే గెలుచుకుంది. వీటిలో అప్నాదళ్(ఎస్‌) గెలుచుకున్న మిర్జాపూర్‌, రాబర్ట్స్‌గంజ్‌ ఉన్నాయి. అయితే.. ఈ నియోజకవర్గాలకు ఇప్పటి వరకూ ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు.

హ్యాట్రిక్‌ సాధిస్తారా..?

మిర్జాపూర్‌ నుంచి అప్నాదళ్‌ అధినేత అనుప్రియ పటేల్‌ 2014 నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందారు. మూడోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఎస్పీ నుంచి రాజేంద్ర ఎస్‌ బింద్‌, బీఎస్పీ నుంచి మనీశ్‌ త్రిపాఠి పోటీలో ఉన్నారు. అయితే.. ఈ నియోజకవర్గం చరిత్ర చూస్తే వరుసగా మూడుసార్లు ఎవరూ గెలుపొందలేదు. దీంతో ఈ స్థానం పటేల్‌కు సవాల్‌గా మారింది. ఇక్కడ హ్యాట్రిక్‌ విజయం సాధించి తన పట్టును నిలుపుకోవాలని ఆమె ఆశిస్తున్నారు. మరోవైపు రాబర్ట్స్‌ గంజ్‌లో ఎస్సీ, ఎస్టీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఓబీసీలకు ఎంతో కీలకం..

మరోవైపు ఈ దశ ఎన్నికలు ఓబీసీ నేతలకు ఎంతో కీలకం కానున్నాయి. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల నేతలైన అనుప్రియ పటేల్‌, ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌, సంజయ్‌ నిషాద్‌, దారాసింగ్‌ చౌహాన్‌లతోపాటు విపక్షాల నేతలైన స్వామి ప్రసాద్‌ మౌర్య తదితరులకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. భాజపా గత ఎన్నికల్లో కోల్పోయిన రెండు సీట్లను తిరిగి పొందేందుకు యత్నిస్తుండగా.. ఎస్పీ, కాంగ్రెస్‌ ఖాతా తెరిచేందుకు కష్టపడుతున్నాయి.

మరోసారి అఖండ విజయమే..

భాజపాకు కంచుకోటగా మారిన వారణాసి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజారిటీపై కన్నేశారు. ఇక్కడి నుంచి మూడోసారి పోటీ చేస్తున్న మోదీ.. 2019 ఎన్నికల్లో 63 శాతం ఓట్లతో అఖండ విజయం సాధించారు. మరోసారి భారీ విజయం దక్కడం ఖాయం. మోదీపై ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌ బరిలో ఉన్నారు. ఈ స్థానంలో 1996 నుంచి భాజపా ఆరుసార్లు విజయం సాధించింది. 2004లో మాత్రం కాంగ్రెస్‌ గెలుపొందింది.

భాజపా కంచుకోట గోరఖ్‌పూర్‌..

ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ గతంలో పోటీ చేసిన గోరఖ్‌పూర్‌ నియోజకవర్గంలో భాజపాకు మంచి పట్టు ఉంది. 1998 నుంచి ఇక్కడ యోగీ వరుసగా గెలుపొందుకుంటూ వచ్చారు. 2017లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని భాజపా తిరిగి దక్కించుకుంది. యోగీ నేతృత్వంలో భారీ మెజార్టీతో మరోసారి ఈ స్థానాన్ని దక్కించుకోవడంపై భాజపా దృష్టి సారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img