Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 May 2024 13:04 IST

1. గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్‌ ప్లేయర్‌: వైఎస్‌ భారతిపై షర్మిల ఫైర్‌

ఓటమి భయంతో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. దీని కోసం పాస్‌పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారన్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్‌రెడ్డి ఉన్నారని.. ఎంపీగా ఆయన గెలిస్తే నేరం గెలిచినట్లేనన్నారు. పూర్తి కథనం

2. ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

అమరావతి: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ నిర్వహించారు.పూర్తి కథనం

3. బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైంది: ప్రధాని మోదీ

ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. మిగిలిన నాలుగు విడతల్లోనూ భాజపా, ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందన్నారు.పూర్తి కథనం

4. రెడ్‌లైన్‌ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్‌ హెచ్చరిక

నిజ్జర్‌ హత్య కేసు విషయంలో కెనడాతో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఒట్టావాలోని భారత హైకమిషనర్‌ (India High Commissioner) సంజయ్‌ కుమార్‌ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి సిక్కు వేర్పాటువాద గ్రూప్‌ (Sikh Separatist Groups)లు రెడ్‌లైన్‌ దాటుతున్నారని హెచ్చరించారు. కెనడా గడ్డ నుంచి భారత భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించే తన ప్రధాన ఆందోళన అని అన్నారు.పూర్తి కథనం

5. యూకే ఎయిర్‌ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!

యూకేలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు నిన్న మొరాయించాయి. ఫలితంగా  ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో భారీగా ప్రయాణికులు బారులు తీరి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు ఐటీ వ్యవస్థ కుప్పకూలడమే దీనికి కారణమని భావిస్తున్నారు. దీంతో బోర్డర్‌ ఫోర్స్‌ సిబ్బంది మాన్యూవల్‌గా ప్రాసెస్‌ చేయాల్సి వచ్చింది.పూర్తి కథనం

6. ఇజ్రాయెల్‌కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత

అమెరికా మాటలను పెడచెవిన పెట్టి గాజాలోకి చొచ్చుకెళుతున్న ఇజ్రాయెల్‌ (Israel)కు ఓ షాక్‌ ఎదురైంది. వాషింగ్టన్‌ నుంచి అందాల్సిన కీలక ఆయుధాల షిప్‌మెంట్‌ను నిలిపేసినట్లు తెలుస్తోంది. ఒక్కోటీ 900 కేజీల బరువుండే 1,800 బాంబులు,  226 కేజీల బరువుండే మరో 1,700 బాంబులు ఇప్పుడు టెల్‌అవీవ్‌కు అందవు. ఈ విషయాన్ని బైడెన్‌ కార్యవర్గంలోని కీలక అధికారి ధ్రువీకరించారు.పూర్తి కథనం

7. గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా

తాము ఉత్పత్తి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్లను మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్టు ఆస్ట్రాజెనెకా (AstraZeneca) ప్రకటించింది. మార్కెట్‌లో అప్‌డేటెడ్‌ టీకాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ వ్యాక్సిన్‌ వ్యాక్స్‌జెవ్రియాకు గిరాకీ తగ్గిందని పేర్కొంది. పూర్తి కథనం

8. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు (Air India Express) చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 విమాన సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణంతో సెలవు పెట్టడమే ఇందుకు కారణం. సంస్థలో కొన్ని విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు 300 మంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లినట్లు సమాచారం.పూర్తి కథనం

9. భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్‌

భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను ఆయన కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. క్రిశాంక్‌ చేసింది తప్పయితే తాను జైలుకు వెళ్తానన్నారు.పూర్తి కథనం

10. ₹2.5కోట్లు ఇస్తే ఈవీఎం మార్చేస్తా.. రాజకీయ నేతను డిమాండ్‌ చేసిన ఆర్మీ జవాన్‌

లోక్‌సభ ఎన్నికల వేళ ఈవీఎం (EVM)ల పేరుతో రాజకీయ నాయకుడిని మోసగించేందుకు ఓ జవాను (Army Jawan) ప్రయత్నించాడు. ఈవీఎంను మార్చేస్తానని, అందుకు రూ.2.5కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఆ నేత చాకచక్యంగా వ్యవహరించి అతడిని పోలీసులకు పట్టించాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని