సిద్దిపేట జిల్లాకు ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ పురస్కారం

సిద్దిపేట జిల్లాలో వైద్యారోగ్య శాఖ అందించిన అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ విభాగంలో ‘ప్రైమ్‌ మినిస్టర్స్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌....

Published : 13 Apr 2022 04:43 IST

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లాలో వైద్యారోగ్య శాఖ అందించిన అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ విభాగంలో ‘ప్రైమ్‌ మినిస్టర్స్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-2019’ జాతీయ పురస్కారం ప్రకటించింది. మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంలో భాగంగా రెండేళ్లలోపు చిన్నారులకు నూరుశాతం టీకాలు పూర్తిచేసినందుకుగానూ జిల్లా ఈ అవార్డుకు ఎంపికైంది. ‘ఏటా మూడు విడతలుగా చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు అందజేస్తాం. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించి టీకా తీసుకోని వారి జాబితా రూపొందించి పంపిణీకి చర్యలు తీసుకుంటారు. జిల్లాలో రెండేళ్లలోపు చిన్నారులు దాదాపు 28 వేల మంది ఉన్నారు. 2018-19లో అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో జరిగిన సర్వేలో వారిలో 1,622 మంది టీకా తీసుకోలేదని గుర్తించి పంపిణీని పూర్తిచేశారు. వంద శాతాన్ని అధిగమించారు. కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఈ విషయాన్ని నిర్ధారించి పురస్కారానికి ప్రతిపాదించాయని’ జిల్లా వైద్యాధికారి డా.మనోహర్‌ తెలిపారు. అప్పటి పాలనాధికారి కృష్ణభాస్కర్‌, జిల్లా వైద్యాధికారి అమర్‌సింగ్‌, టీకా అధికారిణి విజయరాణి, ప్రత్యేకాధికారి కాశీనాథ్‌, వ్యాక్సిన్‌ ఉద్యోగి చంద్రశేఖర్‌ల చొరవ, మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందన్నారు. సివిల్‌ సర్వీసెస్‌ డే పురస్కరించుకుని ఈ నెల 20, 21 తేదీల్లో దిల్లీలో జరిగే కార్యక్రమంలో ట్రోఫీతోపాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కేంద్ర ప్రభుత్వం జిల్లాకు అందిస్తుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని